విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:58 PM
గోదావరిఖని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన వంటశాల, తాగునీటి సౌకర్యం మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.
కోల్‌సిటీటౌన్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన వంటశాల, తాగునీటి సౌకర్యం మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. వీరయ్య మాట్లాడు తూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ గోదావరిఖని ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి దయ నీయంగా ఉందన్నారు. వర్షం పడితే తరగతి గదుల్లోకి నీరు రావడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు మరుగుదొడ్లు లేకపోవడంతో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, విద్యార్థినిల మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేదన్నారు. పాఠశాల కిటికీలకు తలుపులు లేకపోవడంతో కోతులు తరగతి గదుల్లోకి ప్రవేశించి విద్యా ర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో విద్యార్థులు ఇళ్ల నుంచే తాగునీరు తీసుకు రావాల్సి వస్తోందన్నారు. విద్యార్థులకు సరిపడా బెంచీలు లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి బెంచీలకు డెస్కులు లేక తలుపుల చెక్కలను ఉప యోగించుకుంటూ చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన వంటశాలలో సిమెంట్ బస్తాలు, పైపులు నిల్వ ఉంచడంతో వంట చేసేందుకు స్థలం లేకుండా పోయిందన్నారు. వంటశాల స్టోర్ రూమ్‌గా మారడంతో పాములు, తేళ్లు, ఎలుకలు సం చరిస్తున్నాయని చెప్పారు. పాఠశాల రికార్డులను భద్రపరిచేందుకు బీరు వాలు లేకపోవడంతో ఎలుకలు, పందికొక్కులు వాటిని పనికి రాకుండా చేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పేద విద్యార్థులు ఎలా చదువుకోవాలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీపీఎం తరఫున డిమాండ్ చేశారు. సీపీఎం సీనియర్ నాయకుడు తుమ్మల రాజారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, ఎం రామాచారి, గోదావరిఖని పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి, కమిటీ సభ్యులు మెండె శ్రీనివాస్, నాయకులు ఆరెపల్లి రాజమౌళి, అంబాల రాజ్కుమార్, సందీప్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.