రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:45 PM
తరుగు పేరిట కోతలు లేకుండా ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న ఉత్పత్తులను కొనుగోలు చేశామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు అన్నారు. తమ ఉనికి కోసం ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశాయని, వారికి రైతులే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
పెద్దపల్లి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): తరుగు పేరిట కోతలు లేకుండా ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న ఉత్పత్తులను కొనుగోలు చేశామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు అన్నారు. తమ ఉనికి కోసం ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశాయని, వారికి రైతులే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. గురువారం పెద్దపల్లిలోని నందన గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు జిల్లాలో కొనుగోళ్లే నిదర్శనమన్నారు. జిల్లా వ్యాప్తంగా 334 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 4,29,921 మెట్రిక్ టన్నులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 1,018 కోట్ల 65 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం 48 గంటల్లోనే డబ్బులను రైతులకు అందజేశామన్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి జిల్లాలో సుమారు 29 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా సేకరించామన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన 9 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేశామన్నారు. భవిష్యత్తులో రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ ఉంచేందుకు నియోజకవర్గంలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఎలిగేడు మండలం లాలపల్లిలో గిడ్డంగుల సంస్థ ద్వారా 14 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం పనులు ప్రారంభమయ్యాయని, సింగిల్ విండో ఆధ్వర్యంలో మరో 14 వేల మెట్రిక్ టన్నుల గోదాంకు స్థలం కేటాయించామని చెప్పారు. రానున్న రోజుల్లో ఓదెల మండలంలో 20 వేల మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్‌లో 2 వేల మెట్రిక్ టన్నులు, పెద్దపల్లి మండలంలో 2 వేల మెట్రిక్ టన్నులు సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీటి వల్ల పంటలు పండలేదని, ఎస్‌ఆర్‌ఎస్పీ ద్వారానే ఇక్కడి రైతులకు సాగునీరు అందిందని, కాళేశ్వరం ద్వారా ఏ ఊరికి నీళ్లొచ్చాయో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను నాణ్యత లేకుండా నిర్మించడం వల్లనే కుంగిపోయాయని, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ఆధారంగా మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు పనులు చేపడుతోందని వివరించారు. కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేసినందుకు కలెక్టర్, సంబంధిత అధికారులు, ఐకేపీ మహిళా సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వ విప్ విజయరమణారావు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ సారయ్య గౌడ్, పార్టీ నాయకులు ఆకుల మహేందర్, పూదరి మహేందర్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.