యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:18 AM
జిల్లాలోని యువతకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు అన్నారు.
పెద్దపల్లి, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని యువతకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు అన్నారు. సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ. 27 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదుల రెనోవేషన్ పనులు, రూ. 25 లక్షలతో ఏర్పాటు చేసిన టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, జిల్లాలోని యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెద్దపల్లిలో టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన అనేక మంది యువత ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి సుమారు రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. పాఠశాలల పునరుద్ధరణ, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు చేపడుతున్నామని, పెద్దపల్లి మండలంలోనే సుమారు రూ. 14కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో పెద్దపల్లి మండలంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించినట్లు తెలిపారు. గతంలో జిల్లా విద్యా ఫలితాల్లో 32వ స్థానంలో ఉండగా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన చర్యల ఫలితంగా 8వ స్థానానికి చేరుకుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యేటా సుమారు రూ. 800 కోట్లతో అల్పాహార పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మూడేళ్లలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గణనీయమైన మార్పులు వచ్చాయని ప్రభుత్వ విప్ తెలిపారు. ఇటీవల ఆసుపత్రికి నాలుగు అవార్డులు లభించాయని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దె ద్వారా వచ్చే ఆదాయం నేరుగా కళాశాలకు చేరేలా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆసుపత్రుల వద్ద ఉన్న షట్టర్లను అద్దెకు ఇచ్చి వచ్చే ఆదాయాన్ని ఆసుపత్రుల అవసరాలకు వినియోగించేలా చూస్తున్నామని వివరించారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు, పరీక్షా ఫలితాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధ్యాపకులు తదితరులు, పాల్గొన్నారు.