పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతే లక్ష్యం
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:01 AM
పేదల సంక్షేమం రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు అన్నారు. శుక్రవారం దూళికట్టలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లకు సంబంధించిన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు.
ఎలిగేడు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమం రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు అన్నారు. శుక్రవారం దూళికట్టలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లకు సంబంధించిన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి 5,124 నూతన పింఛన్లు మంజూరు కాగా 19న ఇందిరా గాంధీ జయంతిన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతాయని పేర్కొన్నారు. ఎలిగేడు మండలానికి చెందిన 398 నూతన పెన్షన్ లబ్ధిదారులకు, జూలపల్లి మండలానికి చెందిన 406 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలు, మహిళలు, చేనేత, గీత తదితర వృత్తిదారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 11 వేల పైచిలుకు పింఛన్లు రాగా, అందులో 48 శాతం 5,124 ఒక్క పెద్దపల్లి నియోజకవర్గానికే దక్కడం విశేష మన్నారు. అర్హత ఉండి కేవలం 2 నుండి 3 శాతం మందికి చిన్న చిన్న సాంకేతిక కారణాలతో పింఛన్లు రాకుండా పోయాయని, అటువంటి వారు ఆందోళన చెందవద్దని కోరారు. ఆ లోపాలను సరిదిద్ది భవిష్యత్తులో పింఛన్ ఇప్పిస్తానన్నారు. పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు ఏప్రిల్ నుంచి కొత్త ప్రక్రియ ప్రారంభించి, 3,4 నెలల వ్యవధిలో అర్హులకు పింఛన్లు అందిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి మొదటి విడతలో మంజూరైన 3500 ఇందిరమ్మ ఇండ్లలో దాదాపు 2700 మంది పేద ప్రజలు ఇప్పటికే ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నారని, ఇచ్చిన మాట ప్రకారం పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని చెప్పారు. పీఏసీఎస్ చైర్మన్ సామ రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పొట్యాల రమేష్, వైస్ చైర్మన్ కోరుకంటి వెంకటేశ్వర్ రావు, డిఆర్డివో కాళిందిని, ఎలిగేడు, జూలపల్లి మండలాల ఎంపీడీఓలు భాస్కర్ రావు, పద్మావతి, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపసర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.