ముదురుతున్న ‘కేంద్రీయ’ వివాదం
ABN , Publish Date - May 29 , 2026 | 12:29 AM
జిల్లాకు మంజూరు అయిన కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపు సమస్య పరిష్కారం కావడం లేదు. కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించే వ్యవహారంలో బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కారుతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్‌ల మద్య వివాదం రోజురోజుకు ముదురుతోంది.
జగిత్యాల, మే 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మంజూరు అయిన కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపు సమస్య పరిష్కారం కావడం లేదు. కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించే వ్యవహారంలో బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కారుతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్‌ల మద్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. కేంద్రీయ విద్యాలయ స్థల సమస్య ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ ఎంపీ అర్వింద్ అన్న చందంగా మారింది. స్థల కేటాయింపులో స్వార్థ రాజకీయాలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్పడుతున్నాడంటూ ఎంపీ అర్వింద్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల జిల్లా కేంద్రం సమీపంలోని చల్‌గల్ వాలంతరీకి చెందిన రెండెకరాల స్థలాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఇజ్రాయిల్, కరీంనగర్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ పంకజ్ కుమార్ నర్సింగాపూర్, పోరండ్లలో పర్యటించారు. నర్సింగాపూర్‌లో సర్వే నంబరు 437, పోరండ్లలో సర్వే నంబరు 559లో గల ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
పోరండ్ల, నర్సింగాపూర్ స్థలాలపై అసంతృప్తి..
కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం కోసం వాలంతరీ స్థలానికి ప్రత్యామ్నాయంగా అధికారులు పరిశీలించిన నర్సింగాపూర్, పోరండ్ల స్థలాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో సంబంధిత స్థలాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు, డంప్ యార్డు, క్రషర్లు, కొండలు, గుట్టల సమీపంలో స్థలాలు ప్రతిపాదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డే స్కాలర్‌గా పనిచేసే కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల నివాసానికి కనీసం ఐదు కిలోమీటర్ల లోపు ఉండాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆరు నెలల క్రితం మంజూరు..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేక చొరవ చూపడం, పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ గత యేడాది అక్టోబరు నెలలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా అందులో ఒకటి జగిత్యాల జిల్లాకు కేటాయించారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు కూడా విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు సంబంధించి విద్యను అభ్యసించాలంటే రూ. లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పేద, మద్య తరగతి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆశలు చిగురించాయి.
తరగతుల ప్రారంభంపై నీలినీడలు..
కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, తరగతుల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2026-27 విద్యాసంవత్సరం నుంచి భోదన జరిపేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే స్థల కేటాయింపులోనే వివాదం చోటుచేసుకోవడంతో తరగతుల ప్రారంభం, భవన నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాత్కలిక భవనంలోనైనా కేంద్రీయ విద్యాలయం తరగతులను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది. విద్యాలయం ఏర్పాటుపై రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మానుకొని, వేగవంతంగా స్థల కేటాయింపు, భవన నిర్మాణం, విద్యార్థుల ప్రవేశాలు, తరగతుల ప్రారంభంపై ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రత్యామ్నయ స్థలాలను పరిశీలించాము
- డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే, జగిత్యాల
కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి చల్‌గల్ వాలంతరీలో ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించింది. స్థలం సరిపోవడం లేదన్న అభిప్రాయాలతో నర్సింగాపూర్, పోరండ్లలో ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాము. ఇటీవల కేంద్రీయ విద్యాలయ సంఘటన అధికారులు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలన జరిపాము. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
విద్యాలయ ఏర్పాటుపై వివక్షను మానుకోవాలి
- డాక్టర్ బోగ శ్రావణి, బీజేపీ నియోజకవర్గ ఇనచార్జి, జగిత్యాల
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం వివక్షను మానుకోవాలి. విద్యాలయానికి అవసరమైన స్థలాన్ని చల్‌గల్ వాలంతరీలో ఐదెకకరాల నుంచి 10 ఎకరాల వరకు కేటాయింపు జరపాలి. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు మానుకొని విద్యార్థుల భవిష్యత్తును చక్కదిద్దడానికి ప్రయత్నాలు జరపాలి.