Share News

‘ఉపాధి’ అంతంతే!

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:59 AM

జిల్లాలో ఉపాధిహామీ పథకం పనులు నింపాదిగానే జరుగుతున్నాయి. ఆశించిన విధంగా ఊళ్లల్లో చేతినిండా కూలీలకు పనులు దొరకడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలై అప్పుడే నాలుగు నెలలు దాటినా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాదిలో నిర్దేశించిన లక్ష్య సాధన విషయంలో వెనుకబడుతున్నామనే ఆందోళనలో అధికారులున్నారు.

 ‘ఉపాధి’ అంతంతే!

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

జిల్లాలో ఉపాధిహామీ పథకం పనులు నింపాదిగానే జరుగుతున్నాయి. ఆశించిన విధంగా ఊళ్లల్లో చేతినిండా కూలీలకు పనులు దొరకడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలై అప్పుడే నాలుగు నెలలు దాటినా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాదిలో నిర్దేశించిన లక్ష్య సాధన విషయంలో వెనుకబడుతున్నామనే ఆందోళనలో అధికారులున్నారు. 2026-27 సంవత్సరానికి 15.20లక్షల పనిదినాలను పల్లెల్లో జాబ్‌కార్డు కలిగిన వారికి కల్పించా లనే ఆశయం సరైన పర్యవేక్షణ లేని కారణంగా అటకెక్కుతోంది. గ్రామసభల్లో నిర్ణయించు కున్న నెలవారీ ప్రణాళికకు తగినట్లుగా కూలీలు పనులకు వెళ్లడం లేదు. రోజూ వెళ్లాల్సిన సంఖ్యలో కనీసం సగం మంది కూడా తమకు హామీగా అందాల్సిన పని దక్కించుకోలేక పోతున్నారు.

సిబ్బంది సమ్మె ప్రభావం

వికసిత్‌ భారత్‌- గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ ఆండ్‌ అజివిక మిషన్‌(గ్రామీణ)(వీబీజీరామ్‌జీ) పథకాన్ని అమలు చేసే ఉపాధిహామీ సిబ్బంది గడిచిన కొన్ని రోజులుగా సమ్మెబాట పట్టడంతో సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. జూలై 27వ తేదీ నుంచి ఏపీవో, ఈసీ, జేఈ, టీఏ స్థాయిలో ఉన్న సిబ్బంది వారి వేతనాలు, ఇతర డిమాండ్‌లతో ఆందోళన చేపట్టారు. ఈ నెల17వ తేదీ వరకు వారి నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. కూలీలను రప్పించి గ్రామాల్లో ఎంపిక చేసిన పనులను చేయిస్తున్నారు. వనమహోత్సవ కార్యక్రమాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల వద్ద కూలీ లకు పని కల్పిస్తున్నారు. ఊళ్లల్లో వ్యవసాయ పనుల వల్ల గత రెండు నెలలుగా ఉపాధి పనికి చాలామంది రాలేదు. దీంతోపాటు ఊళ్లల్లో ఈ సారి ప్రాధాన్యత కలిగిన పనులను ఎంపిక చేసి వాటి వద్దనే పని ఇస్తుండటంతో దినసరి వేతనం పొందేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

రెండు మాసాల్లో చేసిన పని..

--------------------------------

నెల గృహాలు కూలీలు

--------------------------------

జూలై 14,386 18,780

ఆగస్టు 7,304 8,974

--------------------------------

లక్ష్యం నెరవేరాలంటే...

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్ణయించిన లక్ష్యం 15.20లక్షల పనిదినాలు పూర్తి చేయాలంటే ఖచ్చింతగా ప్రతినెలలో 1.26లక్షల పనిదినాలు పూర్తవ్వాలి. కానీ ఈ సారి సగటున రోజుకు జిల్లాలో 2-3 వేల మంది మాత్రమే పనికి వస్తున్నారు. దీంతో నెలకు 60-90వేల పనిదినాలే అవుతున్నాయి. జిల్లాలో 2.35లక్షల మంది కూలీలున్నారు. ఇందులో 1.16 లక్షల మంది మాత్రమే క్రియాశీల జాబ్‌కార్డు సభ్యులుగా గుర్తింపు పొందారు. ఇలా ఉన్న వారికి కూడా సరైన పని లభించడం లేదు. మరోవైపు గతంతో పోలిస్తే ఈ ఏడాది ఉపాధి హామీ లక్ష్యం తగ్గింది. 2025-26లో 18.15లక్షల పనిదినాలు కాగా 80శాతం పురోగతి కనిపించింది. ఈ సారి లక్ష్యసాధనలో గడిచిన నాలుగు నెలల్లో కేవలం 15శాతం పనిదినాలు మాత్రమే పూర్తయ్యాయి. కొత్తగా గ్రామాల్లో ఈసారి ప్రతిపాదించి 5,143 పనులను ఉపాధి హామీ పథకంలో చేపడుతుండగా ఇందుకోసం రూ.34.8కోట్లు కూలీల వేతనానికి, మెటీరియల్‌ కాంపొనెంట్‌కు వెచ్చించనున్నారు. అయితే లక్ష్యం నెరవేరాలంటే మండలాల వారీగా ఎంపీడీ వోలు మరింత పర్యవేక్షణ పెంచాలి. ఎంపిక చేసిన పనులకు సంబంధించి అనుమతుల మంజూరీ ఇతరత్రా సహకారం అందించి కూలీలకు పనులు పెంచాలి.

Updated Date - Aug 15 , 2026 | 12:59 AM