పల్లెల్లో మోగనున్న ఎన్నికల నగారా
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:11 AM
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగరా మోగనున్నది. పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మళ్లీ మొదలు కానుంది. డిసెంబర్‌లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్ని కలు పూర్తి కాగా, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. తాజాగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మండల, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వ హించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తు న్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగరా మోగనున్నది. పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మళ్లీ మొదలు కానుంది. డిసెంబర్‌లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్ని కలు పూర్తి కాగా, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. తాజాగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మండల, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వ హించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తు న్నది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఓటర్ల జాబితా తయారీకి ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్ - మల్కాజిగిరి మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం దిశానిర్దేశం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం 2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు నవీకరించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రాదేశిక నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్లను గుర్తించి, వారిని సంబంధిత పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా వర్గీకరించాలని అధికారులు ఆదేశించారు. ఈ డేటాను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ ప్రకారం పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాల్సి ఉంటుంది. డేటాలో ఏవైనా లోపాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోపు నివేదించాలని, ఆ తర్వాత ముసాయిదా ఓటరు జాబితాలను విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని ఎస్‌ఈసీ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
జిల్లాలో ఆరంభమైన ఎన్నికల ప్రక్రియ
పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల ప్రక్రియను సంబంధిత మండల, జిల్లా పరిషత్ అధికారులు ఆరంభించారు. జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉండగా, ఇందులో రామగుండం అర్బన్ మండలం మినహా పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో 13 జడ్పిటిసి స్థానాలు, 137 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగను న్నాయి. చివరిసారిగా 2019 మే నెలలో మూడు దశల్లో ఈ ఎన్నికలు జరిగాయి. గత ఏడాది జూన్‌తో మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం ముగియ డంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. వాస్తవానికి గతేడాది సెప్టెంబరులోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నెలకొన్న న్యాయపరమైన చిక్కుల వల్ల ప్రక్రియ నిలిచి పోయింది. తాజాగా హైకోర్టు అనుమతితో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఖరారు చేయనున్నారు. వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓటర్ల జాబితా ఖరారు కాగానే బ్యాలెట్ బాక్సుల తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి పరిపాలనాపరమైన చర్యలు చేపట్టనున్నారు.
అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికల ను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను వచ్చే నెలలోనే నిర్వహించేందుకు తహతహలాడుతున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని హామీ మేరకు చట్టబ ద్ధంగా కార్యరూపం దాల్చకపోగా, పార్టీ పరంగా 42 శాతం టికెట్లు బీసీలకు ఇవ్వనున్నట్లు ఇదివరకే ప్రకటిం చింది. ఆ మేరకు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతానికి మించి టికెట్లు ఇవ్వడం గమనార్హం. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతూ మార్చి నెల లోనే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ, ఇంటర్, పదో తరగతి పరీక్షల నేప థ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ప్రభుత్వం ఎన్నికల ప్రస్తావన తీయలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం చేపట్టిన సామాజిక, ఆర్థిక విద్య, ఉపాధి, కులగణన సర్వే నిర్వ హించగా, ఆ లెక్కలను జిల్లాల వారీగా విడుదల చేశారు. అలాగే ఈనెల 20వ తేదీన కాటారంలో నిర్వహించనున్న బహిరంగ సభలో యాసంగి సీజన్‌కు సంబంధించిన రెండో విడత రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు. దీంతో వచ్చే నెలలో మండల జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ ఎన్నికలు జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. ఇప్పటికే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించగా, ఇదే ఊపు కొనసాగించాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. పార్టీ సింబల్‌పై జరిగే ఎన్నికలు కావటంతో సత్తా చాటాలని బీఆర్‌ఎస్, బీజేపీ సైతం వ్యూహాలకు పదును పెడుతోంది.