సొంతింటి కల నెరవేరుస్తా...
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:31 AM
సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, మారుపేర్ల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం ఉదయం జీడీకే 11ఇంక్లైన్‌ను ఆయన సందర్శించి అండర్ గ్రౌండ్‌లోని పని స్థలాలను పరిశీలించారు.
02జీడీకే05
గోదావరిఖని, జనవరి 5(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, మారుపేర్ల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం ఉదయం జీడీకే 11ఇంక్లైన్‌ను ఆయన సందర్శించి అండర్ గ్రౌండ్‌లోని పని స్థలాలను పరిశీలించారు. అనంతరం గని ఆవరణలో కార్మికులతో మాట్లాడగా పలు సమస్యలను వివరించారు. గని కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు, మెడికల్ బోర్డు ఏర్పాటుపై ఎంపీని అడుగగా ఉప ముఖ్యమంత్రితో ఇప్పటికే మాట్లాడనని, మరోసారి కూడా భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.10వేల పెన్షన్ వచ్చేలా పార్లమెంట్‌లోప్రస్తావించానని, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో మాట్లాడానని చెప్పారు. పార్లమెంట్‌లో అవకాశం వచ్చినప్పుడల్లా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతున్నానని ఎంపీ కార్మికులకు తెలిపారు. బొగ్గు గనులపై మహిళా కార్మికులకు ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వపరంగా అన్నీ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పని సమయాల్లో కార్మికులు రక్షణ, జాగ్రత్తలు పాటించాలని కార్మికులకు సూచించారు. గని ఆవరణలోని దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీకి జీఎం లలిత్ కుమార్ స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ, ఐఎన్‌టీయూసీ నాయకులు పీ మల్లికార్జున్, గని మేనేజర్ శ్రీనివాస్, ఎస్‌ఎస్‌ఓ వీరారెడ్డి ఉన్నారు.
నాట్లు వేసి.. భోజనం చేసి...
కాల్వశ్రీరాంపూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని గంగారం గ్రామశివారులో పొలం పనులు చేసుకుంటున్న పలువురు రైతులను చూసి వాహనాన్ని ఆపారు. కొద్దిసేపు వారితో కలిసి నాట్లు వేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. వారి సమస్యలను తెలుసుకుని, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల కరెంటుతోపాటు రైతులకు మేలు జరిగే పలు కార్యక్రమాలు చేపడుతుందని, నిరుపేదలకు సన్నబియ్యం, రైతులకు బోనస్‌పై వివరించారు.