అహ్లాదం పంచుతున్న ఎల్లమ్మ గుండమ్మ చెరువు
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:39 AM
జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు ఇప్పుడు పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఒకప్పుడు పూడికతో నిండిపోయి, నిర్లక్ష్యానికి గురైన చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకుని పట్టణ ప్రజలకు అహ్లాదాన్ని పంచుతోంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కుటుంబాలతో కలిసి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
పెద్దపల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు ఇప్పుడు పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఒకప్పుడు పూడికతో నిండిపోయి, నిర్లక్ష్యానికి గురైన చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకుని పట్టణ ప్రజలకు అహ్లాదాన్ని పంచుతోంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కుటుంబాలతో కలిసి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చెరువులో బోటింగ్ చేస్తూ సరదాగా గడుపుతున్నారు. నీటి అలల మధ్య బోట్లపై విహరిస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. పెద్దపల్లి మినీ ట్యాంక్‌బండ్ పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది.
మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి పనులు
పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్డులో ఉన్న ఎల్లమ్మ గుండమ్మ చెరువు సుమారు 128 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఉంది. గతంలో పూర్తిగా పూడికతో నిండిపోయి వినియోగానికి నోచుకోని చెరువును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2016లో మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధికి రూ.7.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా రూ.6 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. చెరువు కట్ట విస్తరణ, రిటైనింగ్ వాల్, బండ్ రివిట్‌మెంట్ తదితర పనులు చేపట్టారు. మున్సిపల్ నిధులతో చెరువు కట్టపై సుమారు 1.8 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి, మొక్కలు నాటడంతో పాటు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, సుందరీకరణ పనులతో చెరువు రూపురేఖలు మారిపోయాయి. పట్టణ ప్రజలతో పాటు పలువురు ఉద్యోగ వ్యాపారస్తులు మినీ ట్యాంక్ బండ్ రోడ్డుపై వాకింగ్ చేస్తున్నారు. ఉదయం సాయంత్రం వాకర్స్‌తో కూడా ఈ ప్రాంతం ఎంతో సందడి సందడి ఉంటుంది.
బోటింగ్‌తో మరింత ఆకర్షణ
మినీ ట్యాంక్‌బండ్‌కు పర్యాటక శోభను తీసుకొచ్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం స్పీడ్ బోట్లు, డీలక్స్ బోట్లు పర్యాటకులకు అందుబాటులో ఉండటంతో సందర్శకుల్లో ఆసక్తి పెరుగుతోంది. బోట్లపై విహరిస్తూ నీటి అందాలను వీక్షిస్తున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బోటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు బోటింగ్‌పై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. చెరువు చుట్టూ ఉన్న పచ్చదనం, నీటి అలలు, సాయంత్రం వేళల్లో వీచే చల్లని గాలులు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
సాయంత్రం వేళ సందడే సందడి
సెలవు రోజులు, పండుగ రోజుల్లో మినీ ట్యాంక్‌బండ్‌కు వచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతోంది. యువత సెల్ఫీలు, ఫొటో షూట్లతో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్లమ్మ చెరువులో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ వారి చే ఒక డీలక్స్ బోటు, రెండు స్పీడ్ బోట్లు , రెండు ఫెడల్ బోట్లు అందుబాటులో ఉన్నాయి. డీలక్స్ బోటులో ఇరవై మంది కెపాసిటీ ఉంటుంది. ఒక్కొక్కరికి 50 రూపాయల చొప్పున టికెట్ ఉంది. ఈ బోటులో 15 నిమిషాల పాటు విహరించవచ్చు. స్పీడ్ బోటులో నలుగురు వ్యక్తులకు కలిపి 350 రూపాయలు వసూలు చేస్తారు. ఆరు నిమిషాల పాటు విహరిస్తారు. ఇక ఫెడల్ బోట్లలో మాత్రం రెండు వందలు నలుగురు చెల్లిస్తారు. వీరు 15 నిమిషాల పాటు విహరిస్తారు. ఇలా పట్టణ ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండానే సాయంత్రం వేళల్లో ఆహ్లాదంగా గడిపేందుకు ఈ మినీ ట్యాంక్‌బండ్ చక్కటి వేదికగా మారింది.
పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలి
జిల్లా కేంద్రంలో ఉన్న ఈ చెరువును మరింత సుందరంగా తీర్చిదిద్దితే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముంది. బోటింగ్ సౌకర్యాలతో పాటు పరిసరాల పరిశుభ్రత, తగినంత లైటింగ్, సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే పెద్దపల్లి మినీ ట్యాంక్‌బండ్ ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే సాయంత్రం వేళల్లో సందర్శకులతో కళకళలాడుతున్న ఎల్లమ్మ గుండమ్మ చెరువు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయాలని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.