నిందితులను కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:17 AM
నాగర్‌కర్నూల్ జిల్లా కొమెర గ్రామంలో అగ్రవర్ణాల అహంకారానికి రజక కుటుంబానికి చెందిన పసికందు బలికావడం అత్యంత హేయమైన చర్య అని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష అన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా కొమెర గ్రామంలో అగ్రవర్ణాల అహంకారానికి రజక కుటుంబానికి చెందిన పసికందు బలికావడం అత్యంత హేయమైన చర్య అని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష అన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఉష మాట్లాడుతూ దైవ దర్శనానికి టికెట్ కొనలేమని చెప్పినందుకు సర్పంచ్, మరికొందరు అగ్రవర్ణ వ్యక్తులు కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని, రెండేళ్ల చిన్నారిని కాళ్లతో తొక్కడంతో పసికందు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశా రు. పోలీసులు బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి పసిబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులపైనే అక్రమ కేసులు నమోదు చేయడం, కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. రజక సంఘం నాయకులు బొడ్డుపల్లి లక్ష్మణ్, బొడ్డుపల్లి రామ్మూర్తి, బీసీ జేఏసీ నాయకులు నల్లవెల్లి శంకర్,సతీష్, రాజేందర్, స్వప్న, కొమరయ్య పాల్గొన్నారు.