కమిషనర్‌ను విధుల నుంచి తొలగించాలి
ABN , Publish Date - May 25 , 2026 | 11:40 PM
మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలు గాజనవేణ మల్లమ్మ వడదెబ్బతో మృతి చెందడానికి కారణమైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీని వెంటనే విధుల నుంచి తొలగించాలని, మల్లమ్మ కుటుంబానికి రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సి పల్ కార్పొరేషన్ పారిశుధ్య కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు.
కోల్‌సిటీ, మే 25(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలు గాజనవేణ మల్లమ్మ వడదెబ్బతో మృతి చెందడానికి కారణమైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీని వెంటనే విధుల నుంచి తొలగించాలని, మల్లమ్మ కుటుంబానికి రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సి పల్ కార్పొరేషన్ పారిశుధ్య కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి, నడిపెల్లి మురళీధర్‌రావు, ఎంఏగౌస్ మాట్లాడారు. ఈనెల 21న విధులు నిర్వహిస్తున్న క్రమంలో వడదెబ్బకు గురై మల్లమ్మ మృతిచెందిందని, ఆమె మృతికి కారణమైన కమిషనర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కార్మికులను బానిసలుగా చూస్తూ వారిపై పనిభారాన్ని మోపుతూ మానసికంగా వేధింపులకు గురి చేస్తోందన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం 11గంటలకు ఇండ్లకు పంపించి కార్మికులను రక్షించాల్సిన కమిషనర్ సమయపాలన లేకుండా పని చేయించడం వల్ల కార్మికులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఈ క్రమంలో ముగ్గురు కార్మికులు ఎండదెబ్బ తగిలి ఆసుపత్రిపాలయ్యారన్నారు. కార్మికులకు మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించకుండా నిర్ధేశించిన పని పూర్తి చేయాలని, లేకుంటే పనుల్లోంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పనిముట్లు ఇవ్వకుండా పనులు చేయిస్తున్నారన్నారు. ఈ విషయంలో ఎన్నోసార్లు కమిషనర్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చినప్పటికి పట్టించుకోలేదన్నారు. మల్లమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.20లక్షలు ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ మార్కపురి సూర్య మద్దతు తెలుపుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ కమిషనర్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎం.రామాచారి, కిషన్, రమణ,రామలక్ష్మి, సారయ్య, సునీత, బోయిని రవీందర్, శేఖర్, శోభన్, శ్రీకాంత్, సాగర్, రమాదేవి, కౌసల్య, వేల్పుల రాయమల్లు, రాజేందర్, రమేష్, రూప, రవి, నర్సయ్య, పద్మ, లత, ముంతాజ్ కార్మికులు పాల్గొన్నారు.