Share News

పల్లెల వైపు కేంద్రం చూపు..

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:46 AM

పల్లెలు ఆర్థిక పరిపుష్టి, స్వయం సమృద్ధి సాధించడం ద్వారా దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పల్లెల వైపు దృష్టి సారించింది. ప్రభుత్వ అందించే ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాల ద్వారా పల్లెల అభివృద్ధికి పాటుపడుతోంది.

పల్లెల వైపు కేంద్రం చూపు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పల్లెలు ఆర్థిక పరిపుష్టి, స్వయం సమృద్ధి సాధించడం ద్వారా దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పల్లెల వైపు దృష్టి సారించింది. ప్రభుత్వ అందించే ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాల ద్వారా పల్లెల అభివృద్ధికి పాటుపడుతోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్‌ పంచాయతీ పథకం అమలుకు తాజాగా తెలంగాణ రాష్ట్రాన్ని సైతం ఎంపిక చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక, పర్యాటక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సొంతంగా ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉన్న గ్రామాలను ఆత్మనిర్బర్‌ పంచాయత్‌ పథకం కింద ఎంపిక చేస్తారు. నాబార్డు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి పెట్టుబడులకు రుణ సాయం అందిస్తారు. వచ్చే అదనపు ఆదాయాన్ని గ్రామ మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు అవకాశం కల్పించాలని లక్ష్యంతో ఆత్మనిర్భర్‌ పంచాయత్‌ పేరుతో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది.

జిల్లాలో మూడు పంచాయతీల ఎంపిక

గ్రామల్లో వివిధ ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వనరులను పెంపొందించుకొని ఆదాయాన్ని ఆర్జించి సమగ్ర గ్రామాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఆత్మనిర్భర్‌ పంచాయత్‌ పథకంలో తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా స్థానికంగా వనరులు, అవకాశాలు ఉన్న 48 పంచాయతీలను ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వాల గ్రాంట్ల కోసం ఎదురుచూడకుండానే స్థానికంగానే ఆదాయం సమకూర్చుకునే దిశగా ఏర్పాటుచేసిన ఆత్మ నిర్భర్‌ పంచాయత్‌ పథకంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ గ్రామపంచాయతీలను ప్రాథమికంగా గుర్తించారు. తొలిదశలో ఎంపిక అవుతున్న మూడు గ్రామపంచాయతీలో స్వయంగా కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకొని అదనపు ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించే అవకాశాలు కల్పిస్తారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వాటిలో కనిష్ఠంగా రూ 50 లక్షలు అంతకంటే ఎక్కువగా ఆదాయం ఉన్న పంచాయతీలను మాత్రమే ఎంపిక చేశారు. గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో ఉన్న గ్రామపంచాయతీలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలు ఉపాధి కోసం వస్తున్నారు. ఫంక్షన్‌ హాల్స్‌, సంతలు, వ్యాపార సముదాయాలు, పెట్రోల్‌ బంకులు, సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లు వంటి వాటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆత్మ నిర్బర్‌ పంచాయత్‌ పథకం కింద ఎంపిక చేసిన మూడు గ్రామపంచాయతీలో నాబార్డ్‌, వివిధ బ్యాంకుల ద్వారా రుణాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. త్వరలోనే ఆత్మ నిర్భర్‌ పంచాయత్‌ పథకంలో ప్రాథమికంగా ఎంపికైన ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు జిల్లా పంచాయతీ అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. లాభదాయకమైన ప్రాజెక్టులపై ప్రతిపాదనలు నివేదికలను రూపొందించనున్నారు.

జిల్లాకు ఐదేళ్లలో రూ 160 కోట్ల ఆర్థిక సంఘం నిధులు

గ్రామాల్లో కనీస అవసరాల కోసం ప్రధాన వనరుగా ఆర్థిక సంఘం నిధులే ఊరట కలిగిస్తాయి. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో పల్లెలకు ఆర్థిక భరోసా కలుగుతుందని భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా గత సంవత్సరం డిసెంబర్‌లో కొత్త పాలకవర్గాలు కొలువుతీరాయి. కొలువుదీరిన మూడు నెలలకు 15వ ఆర్థిక సంఘం నిధులు మొదటి, రెండు విడతల్లో కలిపి రూ 19.83కోట్లు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి గ్రామాల జనాభా, ఇతర సామాజిక, ఆర్థిక ప్రమాణాల ఆధారంగా నిధులు కేటాయిస్తుంది. ప్రతి ఐదేళ్ల్లకు ఒకసారి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఏర్పడే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి మార్చి 31తో ముగిసిపోయింది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం ప్రారంభమైంది. 2031 మార్చి ఒకటి వరకు ఐదేళ్లపాటు ఆర్థిక సంఘం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఐదేళ్లకు సంబంధించి కేంద్రం రూ.4,35,236 కోట్లు కేటాయించగా, తెలంగాణకు రూ 9,968 కేటాయించారు. ఇందుకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆర్థిక భరోసా ఎంత కలుగుతుందనే దానిపై లెక్కలు వేస్తున్నారు. పల్లెల అభివృద్ధికి కేటాయించే ఆర్థిక సంఘం నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5.52 లక్షల వరకు ఉన్నారు. గడిచిన ఆర్థిక సంఘంలో జిల్లాకు రూ 100 కోట్ల వరకు నిధులు వచ్చాయి. ప్రస్తుతం జనగణనలో జిల్లాలో జనాభా పెరుగుతుండటంతో నిదులు పెరుగుతాయి. దీని ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు 2026-2031 వరకు రూ 160 కోట్ల వరకు నిధులు సమకూరుతాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించే ఆర్థిక సంఘం నిధుల్లో 80 శాతం నిధులు గ్రామపంచాయతీలకే కేటాయిస్తారు. మిగతా 20 శాతంలో 10 శాతం జిల్లా పరిషత్‌, మరో 10 శాతం మండల పరిషత్‌కు కేటాయిస్తారు. గ్రామాలకు అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం రెండు విడతలుగా నిధులు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారుల నిర్మాణం, వీధిదీపాలు, మంచినీటి సౌకర్యం ఇతర ప్రజా అవసరాలకు సంబంధించిన వాటికి వినియోగించే విధంగా మార్గదర్శకాలు ఉన్నాయి. గతంలో ఆర్థిక సంఘం నిధులు ఇతర అవసరాలకు వినియోగించినసందర్భాలు ఉన్నాయి. ఉద్యోగుల వేతనాలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వాటికి ఖర్చు చేసేవారు. ఈసారి నిబంధనలను కఠినతరం చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 16వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది.

Updated Date - Jun 14 , 2026 | 12:46 AM