Share News

ముగిసిన ప్రచార పర్వం

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:36 AM

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఇన్నాళ్లు మోత మోగిన మైక్‌లు సోమవారం సాయంత్రం మూగబోయాయి. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

ముగిసిన ప్రచార పర్వం

జగిౄత్యాల, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఇన్నాళ్లు మోత మోగిన మైక్‌లు సోమవారం సాయంత్రం మూగబోయాయి. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని వైన్‌ షాపులు మూత పడ్డాయి. దీనికి తోడు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, మెట్‌పల్లి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో రాజకీయం పతాక స్థాయికి చేరింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో గల 136 వార్డుల్లో 655 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

వార్డుల్లో హోరాహోరీ ప్రచారం..

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగింది. కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, బల్మూరి వెంకట్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి సాబీర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్‌ రావులు ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామంచంద్రరావు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరింద్‌, మాజీ ఎంపీ వెంకటేశ్‌ నేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, పార్టీ నియోజకవర్గ నేతలు డాక్టర్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌, డాక్టర్‌ చిట్నేని రఘులు ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌ తదితరులు ప్రచారం చేశారు. ఏఎంఐఎం, జనసేన, బీఎస్‌పీ, ఆప్‌, సీపీఐ, సీపీఐ (ఎం), ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులకు ఆయా పార్టీల రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ప్రచారం నిర్వహించారు. జగిత్యాలలో రెబల్స్‌గా పోటీ చేస్తున్న తమ అనుచరులకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ ప్రచారం నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది.

రేపు పోలింగ్‌

మున్సిపల్‌ ఎన్నికలు బుధవారం జరగనుండగా అభ్యర్థులు ఓట్లు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని అస్త్రాలు ప్రయోగిస్తూ వస్తున్న అభ్యర్థులు ఇప్పుడు ప్రలోభాలకు తెర లేపారు. పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి పెట్టిన అభ్యర్థులు పోలింగ్‌ ఏజెంట్లకు పెద్ద మొత్తంలో డబ్బులు అప్పగిస్తున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల ఏజెంట్లతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మాట్లాడి డబ్బులు సమకూర్చుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా మహిళా సంఘాలు, యువజన సంఘాలపై దృష్టి కేంద్రీకరించి, వారికి పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేసే పనిలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Updated Date - Feb 10 , 2026 | 01:36 AM