‘మండే’ ఎండ
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:45 AM
సూర్యుడు చెలరేగిపోతున్నాడు.. భగ్గుమంటున్న ఎండవేడికి రాజన్న సిరిసిల్ల జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. తీవ్రమైన ఉక్కపోత.. ప్రాణాంతకంగా వడగా లులు వీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ మాసంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సూర్యుడు చెలరేగిపోతున్నాడు.. భగ్గుమంటున్న ఎండవేడికి రాజన్న సిరిసిల్ల జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. తీవ్రమైన ఉక్కపోత.. ప్రాణాంతకంగా వడగా లులు వీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ మాసంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. జిల్లాలో గడిచిన సంవత్సరాల్లో మే మాసంలో మాత్రమే 43 గరిష్ట డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలుగా నమోదు అవుతుం డేవి. ఈ సారి ఏప్రిల్‌లోనే గరిష్ట ఉష్ణోగ్రత 45 గరిష్ట డిగ్రీలు దాటిపోయింది. వాతావరణశాఖ ‘రెడ్ అలర్ట్’గా ప్రకటించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరి స్తోంది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్‌నినో ప్రభావం కనిపించింది . గడిచిన వారం రోజులుగా 43 డిగ్రీలుగా నమోదవుతున్న ఉష్ణోగ్రత 45.1 డిగ్రీలు దాటిపోయింది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఉదయం 9 గంటలు దాటిందంటేనే ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి భయపడే పరిస్థితి మొదలైంది. ప్రజలు ఎండవేడికి సాయంత్రం దాటిన తర్వాతనే బయటకు వస్తున్నారు. ఉద్యోగులు, వీధి వ్యాపారులు రోజువారి కూలి పనుల కోసం వెళ్లేవారు తప్పని పరిస్థితుల్లో సెగల కక్కుతున్న ఎండలో ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు.
ఏసీలు, కూలర్లను వదలని జనం
ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వదిలి జనం ఉండలేకపోతున్నారు. ఎండ తీవ్రత తట్టుకోవడానికి ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. ఎండ వేడితో మధ్య తరగతి కుటుంబాలు సైతం ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. కూలర్ల కొనుగోళ్లు ఎక్కువగానే ఉన్నాయి. ఏసీలు, కూలర్ల వినియోగంతో కరెంటు మీటర్లు కూడా గిరగిరా తిరుగుతున్నాయి. గృహజ్యోతి పథకం జీరో బిల్లును ఎండ వేడి దూరం చేస్తోంది.
నిర్మానుష్యంగా రోడ్లు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిత్యం రోడ్లు వాహనాలతో బిజీగా కనిపించేవి. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి మీద పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఎండవేడికి రావడం తగ్గించడంతో ఎప్పుడు రద్దీగా కనిపించే సిరిసిల్ల మార్కెట్, గాంధీచౌక్ అంబేద్కర్ చౌరస్తా, చేనేత చౌక్, పెద్ద బజార్, గోపాల్ నగర్, వెంకంపేట ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. షాపింగ్ మాల్‌లో కొనుగోలుదారులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వేములవాడలో భక్తులు ఎండవేడికి ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ప్రజలు శీతల పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు. మజ్జిగ, పండ్ల రసాలు, చెరుకు రసాలు, కొబ్బరి బోండాలు, ఐస్ క్రీములు వంటి వాటితో సేద తీరుతున్నారు.
భయపెడుతున్న గాలి దుమారం.. అకాల వర్షం
ఒకవైపు ఎండలు బగ్గుమంటుంటే మరోవైపు గాలి దుమారం, అకాల వర్షాలు జిల్లా ప్రజలను భయపెడుతున్నాయి. ఉదయమంతా వడగాళ్లతో ఇబ్బంది పడితే సాయంత్రం వేళలో ఒక్కసారిగా వడగళ్లతో వర్షాలు, భారీ గాలి దుమారాలకు ఇబ్బందులు పడుతున్నారు. చెట్లు విరిగిపోవడం, ఇండ్లు, షెడ్లు దెబ్బతింటు న్నాయి. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో రైతు లు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో రెడ్ అలర్ట్
ఉష్ణోగ్రతలు తీవ్రతను బట్టి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. 0.35 గరిష్ట డిగ్రీల వరకు గ్రీన్ అలర్ట్, 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఎల్లో అలర్ట్, 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఆరెంజ్ అలర్ట్, 45 డిగ్రీలకు పైగా నమోదైతే రెడ్ అలర్ట్‌గా ప్రకటిస్తుంది. సోమవారం జిల్లాలో పలుచోట్ల 45.1 డిగ్రీలుగా నమోదైంది. రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో రెడ్ అలర్ట్‌గా హెచ్చరిక జారీ చేసింది. మిగతా ప్రాంతల్లో అరెంజ్ అలర్ట్ ఉంది.
మండలం గరిష్ట ఉష్ణోగ్రత
రుద్రంగి 45.2
కోనరావుపేట 45.1
ఇల్లంతకుంట 44.8
బోయిన్‌పల్లి 44.8
వేములవాడరూరల్ 44.5
చందుర్తి 44.5
ఎల్లారెడ్డిపేట 44.3
గంబీరావుపేట 44.2
సిరిసిల్ల 44.1
వేములవాడ 43.8
తంగళ్లపల్లి 43.7
వీర్నపల్లి 43.7
ముస్తాబాద్ 43.5
అప్రమత్తతోనే రక్షణ
-డాక్టర్ శ్రీవాణి, వైద్యురాలు
ఎండల తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉంది. ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటమే రక్షణ. అత్యవసరం అయితేనే ఎండలో బయటకు వెళ్లాలి. తలపై తెల్లటి వస్త్రం, టోపీ, టవల్, గొడు గు వంటివి ఉపయోగించాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా నీళ్లు ఎక్కువగా తాగాలి. వేసవిలో సాధ్యమైనంతవరకు తెల్లటి కాటన్ వస్త్రాలు ధరించాలి. ఎండ తో అస్వస్థతతకు గురైతే వెంటనే వారిని చల్లటి నీడ ప్రదేశానికి తీసుకెళ్లి తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.