Share News

బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు..

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:44 PM

పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదు.. యువతకు ఉపాధి కల్పించలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. దుర్మార్గ పాలన సాగించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీఽధర్‌ బాబు అన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు..

పెద్దపల్లి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదు.. యువతకు ఉపాధి కల్పించలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. దుర్మార్గ పాలన సాగించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీఽధర్‌ బాబు అన్నారు. బీఆర్‌ఎస్‌ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసినా కూడా దారిలో పెట్టి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని, మాటలకే పరిమితం కాదని, చేతల్లో చూపిస్తున్నామని, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. బుధవారం పెద్దపల్లిలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులకు ప్రజలు పట్టం గట్టారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క పేద వాడికి కూడా ఇళ్లు ఇవ్వలేదని, పెద్దపల్లి సహ ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. ఇది నిరంతర కార్యక్రమమని, యేటా ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చామని, చేర్పులు మార్పులకు అవకాశం కల్పించి ఒక్కక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పట్టణాలు, పల్లె సీమలకు ఏమి మేలు చేయలేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు కల్పించామన్నారు. రైతు భరోసా ఇస్తూ, ధాన్యం కొనుగోళ్లలో కటింగ్‌ లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గ్రూపు 1,2,3 పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు. త్వరలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు స్థల సేకరణ జరుగుతున్నదన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేందుకు ఆర్టీసీ బస్సు డిపోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐటీఐలో ఏటీసీని ఏర్పాటు చేసి విద్యార్థులకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి, మంథని పట్టణాలకు బైపాస్‌ రోడ్లు మంజూరు చేశామన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు జనక ప్రసాద్‌, గోపగాని సారయ్య గౌడ్‌, శశిభూషణ్‌ కాచే, తాడూరి శ్రీమాన్‌, సమ్మయ్య, తిరుపతి యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:44 PM