యాసంగి పంటలకు పది గంటల విద్యుత్ సరఫరా
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:38 PM
యాసంగిలో ఆరుతడి పంటలతో పాటు తృణధాన్యాల పంటల సాగు చేసుకోవాలని, పంటలు పూర్తయ్యే వరకు పది గంటల పాటు విద్యుత్ సరఫరా ఉంటుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. గురువారం గుండ్లపల్లి, కనగర్తి, ఓదెల, కొమిర, పొత్కపల్లి, జీలకుంట, భీమరపల్లి, కొమిర గ్రామాల్లో ప్యాక్స్, సెర్ఫ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను, విప్ ప్రారంభించారు.
ఓదెల, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : యాసంగిలో ఆరుతడి పంటలతో పాటు తృణధాన్యాల పంటల సాగు చేసుకోవాలని, పంటలు పూర్తయ్యే వరకు పది గంటల పాటు విద్యుత్ సరఫరా ఉంటుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. గురువారం గుండ్లపల్లి, కనగర్తి, ఓదెల, కొమిర, పొత్కపల్లి, జీలకుంట, భీమరపల్లి, కొమిర గ్రామాల్లో ప్యాక్స్, సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, పొత్కపల్లిలో ఏర్పాటుచేసిన హాక కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గింజ కోత లేకుండ కొనుగోళ్ళు నిర్వహిస్తామన్నారు. సన్నాలకు ప్రభుత్వ మద్దతు ధరతో పాటు బోనస్‌తో క్వింటాల్‌కు రూ.2961 చెల్లిస్తామని, దీనికంటే ఎక్కువ ధర పెడతామని ప్రయివేటు వ్యాపారాలు వస్తే నగదు వెంటనే చెల్లిస్తేనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం తుఫాన్ ప్రభావం వల్ల ధాన్యంలో తేమ తగ్గే అవకాశం లేదని, కొనుగోలు కేంద్రాల్లో కొంత ఆలస్యం కావచ్చని రైతులు సంయమనం పాటించాలన్నారు. జనవరి వరకు ఎండ తీవ్రత 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని, భూగర్భ జలాలు తగ్గుముఖం పడతాయని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి, సీఈవో గోలి అంజిరెడ్డి, సర్పంచులు, నాయకులు విజయేందర్ రెడ్డి,ఆకుల మహేందర్, రెడ్డి రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.