పది విద్యార్థులకు ‘కార్పొరేట్’ గాలం
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:38 AM
కార్పొరేట్ విద్యాసంస్థల మాయాజాలానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు బలవుతున్నారు. పది పరీక్షలు ముగియక ముందే ఇంటర్ అడ్మిషన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తూ మభ్యపెట్టి తమ కళాశాలల్లో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
కార్పొరేట్ విద్యాసంస్థల మాయాజాలానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు బలవుతున్నారు. పది పరీక్షలు ముగియక ముందే ఇంటర్ అడ్మిషన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తూ మభ్యపెట్టి తమ కళాశాలల్లో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం కార్పొరేట్ సంస్థలు ఏజెంట్లను రంగంలోకి దింపారు. జిల్లాలో ఒకవైపు పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభం కాగా ఏప్రిల్ 13వరకు కొనసాగుతాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పది విద్యార్థుల వివరాలను ముందుగానే సేకరించి వారి ఇళ్ల వద్దకు వెళ్లి అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాదులోని పలు కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏజెంట్లు విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తూ ఇంటర్, ఎంసెట్, ఐఐటీ, జేఈఈ అంటూ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తుగా అడ్మిషన్ తీసుకొని ఫీజు చెల్లిస్తే రాయితీలు ఇస్తున్నారు. జిల్లాలో 60శాతానికి పైగా హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోని పలు కార్పొరేట్ కళాశాలల్లోనే అడ్మిషన్లు పొందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కార్పొరేట్ యాజమాన్యాలు పోటీ పడుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ముందుగానే మాట్లాడుతూ వారి సహకారంతో అడ్మిషన్లు పొందుతున్నారు. కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలల యజమాన్యాలు 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల నుంచి నిత్యం తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలస్యంగా అడ్మిషన్లు తీసుకుంటే ఫీజులు ఎక్కువగా అడుగుతారని, సీట్లు దొరకవనే ఆందోళనతో కార్పొరేట్ కళాశాలల పీఆర్వోల వలలో పడుతున్నారు. తల్లిదండ్రుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని ఒప్పించి అడ్మిషన్ ఒప్పందాలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు సీట్లు దొరకవని భయపెడుతుండడంతో అప్పులు చేసి అడ్మిషన్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఫీజులు కూడా లక్షల్లోకి మారడంతో తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
విస్తృతంగా ప్రచారం...
పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాకముందే జిల్లాలో విద్యార్థుల అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, కన్సల్టెన్సీలు, ప్రైవేటు కళాశాలల పీఆర్వోలు సేకరించి పకడ్బందీగా అడ్మిషన్ల ప్రచారం జోరుగా సాగుతోంది. ఏప్రిల్‌లోనే పది పరీక్షలు పూర్తి కానున్నాయి. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు అడ్మిషన్లపై ఒత్తిడి పెంచి ఒక్కో విద్యార్థిపై అడ్వాన్స్‌లు తీసుకుంటున్నారు. అడ్మిషన్లు సేకరించిన పీఆర్వోకు ఒక విద్యార్థిపై రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు కమీషన్ అందుతున్నట్లు చెప్పుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ కళాశాలల్లో చేరడానికి అసక్తి చూపుతున్నారు. జిల్లాలోని కళాశాలల్లో సరైన ల్యాబ్‌లు, లెక్చరర్లు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రైవేటు కళాశాలల్లో చేర్పించడానికి మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. పీఆర్వోలు, కన్సల్టెన్సీల మాటలు విని చేర్పించిన తరువాత హాస్టల్‌లో సరైన వసతి లేకపోవడం, భోజన సౌకర్యం సరిగా లేక చాలా మంది విద్యార్థులు తిరిగి వస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
జిల్లాలో 7317 మంది విద్యార్థులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పది పరీక్షలకు 7,317 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 3,511 మంది, బాలికలు 3806 మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 138మంది ఉండగా, బాలురు 86మంది, బాలికలు 52 మంది ఉన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3,091 మంది విద్యార్థులు ఉండగా, బాలురు 1,691మంది, బాలికలు1,400 మంది, మోడల్ స్కూల్‌లో 535మంది ఉండగా, బాలురు 288 మంది, బాలికలు 247 మంది, కేజీబీవీలో 563 మంది బాలికలు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 1,926 మంది విద్యార్థులు ఉండగా, బాలురు 1,120, బాలికలు 806 మంది ఉన్నారు. మైనార్టీ వెల్ఫేర్ ఫాఠశాలలో 70 మంది ఉండగా, బాలురు 30, బాలికలు 40 మంది ఉన్నారు. తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌లో 504 మంది ఉండగా, బాలురు 140 బాలికలు 364 మంది ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌లో బాలికలు 63 మంది ఉన్నారు. ఎంజేటీబీసీ వెల్ఫేర్‌లో 287 మంది ఉండగా, బాలురు 156 బాలికలు 131 మంది ఉన్నారు.
జిల్లాలో మెరుగైన ఫలితాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పది వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలే సాధిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరం 6,754మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కాగా, 6629 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 3,119 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 3,041 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,635 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా 3,588 మంది ఉత్తీర్ణులయ్యారు. 98.15 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు 97.50 శాతం, బాలికలు 98.71 శాతం ఉత్తీర్ణులయ్యారు.
సంవత్సరాల వారీగా
విద్యాసంవత్సరం ఉత్తీర్ణత శాతం
2016 - 2017 87.3
2017 - 2018 91.3
2018 - 2019 97.7
2019 - 2020 100
2020 - 2021 100
2021 - 2022 95.76
2022 - 2023 94.37
2023 - 2024 98.27
2024- 2025 98.15