మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:35 PM
మహాశివరాత్రికి గోదావరిఖనిలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో వారం రోజుల ముందు నుంచే ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. కోదండ రామాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కోల్‌సిటీటౌన్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రికి గోదావరిఖనిలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో వారం రోజుల ముందు నుంచే ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. కోదండ రామాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినం రోజున భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈఓ, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనానికి బారికేట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈసారి శివపార్వతుల కల్యాణోత్సవానికి ఇబ్బంది క లగకుండా భక్తుల సౌకర్యార్ధం ఆలయం ముందు కల్యాణాన్ని వేలాది మంది భక్తులు వీక్షించే విధంగా వేదికను సిద్ధం చేశారు. జనగామలోని త్రిలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. మార్కండేయకాలనీలోని మార్కండేయశివాలయం, పవర్‌హౌస్‌కాలనీలోని కాశీవిశ్వేశ్వరాలయం, భరద్వాజనగర్‌లోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో రామేశ్వరస్వామికి శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రధాన చౌరస్తా కూడలిలో జాగరణ పూజా సామాగ్రి
మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు, జాగరణ చేసేందుకు కావాల్సిన పూజా సామాగ్రి ప్రధాన చౌరస్తా - శివాజీనగర్ కూడలిలో రెండు రోజుల ముందు నుంచే అమ్మకాలు జరుగుతున్నాయి. జాగరణకు కావాల్సిన మట్టి ప్రతిమలు, మోదుగపూలు, పండ్లు, కుంకుమ, జొన్నకంకులు వంటివి పూజా వస్తువులు అమ్ముతున్నారు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 14 (ఆంద్రజ్యోతి): శివరాత్రి పురస్కరించుకుని శివాలయాలు ముస్తాబయ్యాయి.. పాత బజారులోని శివాలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. వారం రోజుల నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. రంగులు వేయించడంతో పాటు ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలంకరణలు చేశారు. ఆదివారం తెల్లవారుఝాము నుంచి అర్థరాత్రి వరకూ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. భక్తులు జాగరణ ఉండడంతో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రవచనాలు ఉంటాయి. చెరువు వద్ద గల గుడిమిట్టపల్లి ఆలయంలో కూడా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఆకుల రాములు ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా జాగరణ చేయనున్న భక్తుల కోసం ఆలయం ఆవరణలలో ఒగ్గు కళాకారడు తోడేటి రాములు ఆధ్వర్యంలోని కళా బృందం ప్రదర్శన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కనుకుల, చిన్నకలువల, కొదురుపాక, చిన్నకలువల, గర్రెపల్లి, సుద్దాల, బొంతకుంటపల్లి, ఐతురాజుపల్లి, రేగడిమద్దికుంట తదితర గ్రామాలో ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి
కాళేశ్వరం, వేలాల జాతరలకు ప్రత్యేక బస్సులు
మంథని, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా మంథని బస్టాండ్ నుంచి కాళేశ్వరం, వేలాల జాతరలకు ఆదివారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మంథని ఆర్టీసి డీఎం శ్రావణ్ కుమార్ శనివారం తెలిపారు. మంథని నుంచి మంచిర్యాల జిల్లా వేలాల జాతరకు పెద్దలకు రూ. 70, పిల్లలకు రూ. 50, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంకు పెద్దలకు రూ. 140, పిల్లలకు రూ. 80 బస్సులు చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. వేలాలకు 10, కాళేశ్వరంకు 8 బస్సులు నడుపుతామని, రద్దీని ఆధారంగా బస్సు సర్వీస్‌లను పెంచడం, తగ్గించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.