46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - May 25 , 2026 | 12:02 AM
భానుడు భగభగమంటున్నాడు. 15 రోజులుగా ఎండలు దంచికొట్టుతున్నాయి. ఆదివారం జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఏడుగంటలకే సూర్యుడు సురసురమంటున్నాడు.
కళ్యాణ్‌నగర్, మే 24(ఆంధ్రజ్యోతి): భానుడు భగభగమంటున్నాడు. 15 రోజులుగా ఎండలు దంచికొట్టుతున్నాయి. ఆదివారం జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఏడుగంటలకే సూర్యుడు సురసురమంటున్నాడు. ఉదయం పదిగంటలకే రోడ్లన్ని నిర్మాను ష్యంగా మారుతున్నాయి. రాత్రి తొమ్మిది దాటిన ఎండ వేడమి తగ్గకపోవ డంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బతో జనం పిట్టల్లాగ రాలిపోతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెండు రోజులలో వడదెబ్బతో పది మంది మృతిచెందారు. అత్యవసర పరిస్థితులలో తప్ప జనం ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. రామగుండం ఉపరితల గనులలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉపరితల గనుల్లో ఉదయం రెండో షిప్టులలో కార్మికుల హాజరుశాతం తగ్గుతుంది. కార్మికుల విధుల సమయాలు మార్చాలని డిమాండ్ చేసిన యాజమాన్యం పట్టించుకోవడం లేదు. అత్యవసర పరిస్థితులలో టోపిలు జేబురుమాళ్ళు ధరించి బయటకు వస్తున్నారు. ఉదయం నుంచే వేడిగాలులతోపాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. సోమవారం నుంచి రోహిణికార్తె ప్రారంభం కానున్నది. వారం రోజులు జనం ఇండ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. పెద్దపల్లి జిల్లాను రెడ్ జోన్‌గా ప్రకటించింది.
ప్రజలు బయటకు రావద్దు : ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్
ఎండలు పెరగడం వల్ల వారంరోజుల పాటు రామగుండం నియోజకవర్గం ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావ ద్దని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని ఎక్కువగా మంచినీరు, మజ్జిక తీసుకోవాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులను ఎండలో పనిచేయకుండా పని సమయాలు మార్చాలని, ట్యాంకర్లతో నీటిని చల్లించాలని కలెక్టర్‌ను కోరారు.
ఐదుచోట్ల 46 డిగ్రీలు దాటిన ఎండలు
జిల్లాలో ఆదివారం ఐదు ప్రాంతాల్లో 46డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా 11 కేంద్రాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. ఎలిగేడు 46.2, మంథని 46.1, కల్వచర్ల 46.0, కమాన్‌పూర్ 46.0, యైుటింక్లయిన్‌కాలనీ 46.0 అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఓదెల 45.9, భోజన్నపేట 45.7, మల్యాలపల్లి 45.7, ఈశాలతక్కళ్లపల్లి 45.6, ఆకెనపల్లి 45.5, సుగ్లాంపల్లి 45.3, జూలపల్లి 45.2, కనుకుల 45.1, ముల్కలపల్లి 45.0, ధర్మారం 45.0, రంగంపల్లి 44.7, రామగుండం 44.6, ఎక్లాస్‌పూర్ 44.6, కూనారం44.5, పాలితం 44.5, శ్రీరాంపూర్ 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.