Share News

కేసీఆర్‌ ముందుచూపుతోనే తెలంగాణ అభివృద్ధి

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:10 PM

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, అనంతరం పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దాసరి మమతారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు.

కేసీఆర్‌ ముందుచూపుతోనే తెలంగాణ అభివృద్ధి

పెద్దపల్లి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, అనంతరం పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దాసరి మమతారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో రైతులు తిరిగి సాగునీరు, విద్యుత్‌ సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతుల అవసరాల కోసం గత ప్రభుత్వం రాళ్లపల్లి వద్ద వరద కాలువ నుంచి కాకతీయ కాలువకు లింక్‌ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం 1,100 క్యూసెక్కుల నీరు అవసరముండగా కేవలం 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారని, ఎస్సారెస్పీ కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్‌ చిన్న జిల్లాలను ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చారని తెలిపారు. మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మమతారెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఏర్పాటుతో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌, మాతా శిశు సంరక్షణ కేంద్రం, డయాలసిస్‌ యూనిట్‌, వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి కృషితో పట్టణంలో విశాలమైన రహదారులు, సెంట్రల్‌ లైటింగ్‌ వంటి అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పాలనలో విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలను ఎందుకు కొనసాగించడం లేదని ప్రశ్నించారు టీఎస్‌టీఎస్‌ మాజీ చైర్మన్‌ చిరుమల్ల రాకేష్‌ మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు జిల్లా ఏర్పాటులో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఠాకూర్‌ రఘువీర్‌ సింగ్‌, ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్‌ దాసరి ప్రశాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:10 PM