సాంకేతిక లోపం... ఉపాధి కూలీలకు శాపం
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:26 PM
పోతారం గ్రామంలో సోమవారం ఉపాధిహామీ కూలీలు ఆందోళనకు దిగారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పొరపాట్లు, యాప్ ఫొటోల తిప్పలు, రికార్డుల గందరగోళంపై కూలీలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఒకే రోజు సుమారు 400 మంది కూలీలకు పని కల్పించారు. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో కూలీలు వస్తే, అక్కడ కేవలం ముగ్గురు మేట్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
ముత్తారం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): పోతారం గ్రామంలో సోమవారం ఉపాధిహామీ కూలీలు ఆందోళనకు దిగారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పొరపాట్లు, యాప్ ఫొటోల తిప్పలు, రికార్డుల గందరగోళంపై కూలీలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఒకే రోజు సుమారు 400 మంది కూలీలకు పని కల్పించారు. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో కూలీలు వస్తే, అక్కడ కేవలం ముగ్గురు మేట్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఉపాధి హామీ నిబంధనల ప్రకారం పని ప్రదేశంలో ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 400 మందికి కేవలం ముగ్గురు మేట్లు ఫొటోలు తీయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. సమయానికి ఫొటోలు రాకపోవడం, సర్వర్ల సమస్యల వల్ల హాజరు పడటం లేదని, దీనివల్ల తాము పని చేసినా డబ్బులు నష్టపోవాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ డిమాండ్ నోటీసుల్లో చోటు చేసుకున్న అక్రమాలు, పొరపాట్లు కూలీల ఆగ్రహానికి గురిచేశాయి. గ్రామంలో ఎప్పుడో చనిపోయిన వారి పేర్లు, ఊళ్లోనే లేకుండా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు నోటీసుల్లో దర్శనమిస్తున్నాయి. నిత్యం ఎండనక, వాననక కష్టపడి పనికి వస్తున్న అసలైన కూలీల పేర్లు జాబితాలో లేకపోవడం గమనార్హం. సమస్యలను పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కూలీలు పని ప్రదేశంలోనే ఆందోళనకు దిగారు. పనికి వస్తున్న ప్రతి కూలీకి హాజరు పడేలా చూడాలని, మేటీల సంఖ్యను పెంచి ఫొటోల సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంపిడిఓ సురేష్ అక్కడికి చేరుకొని కూలీలకు నచ్చజెప్పి ఆందోళనను సద్దుమణిగించారు. సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.