వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:47 PM
ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయుర్వేద, హోమియో, యునాని మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, జిల్లా ఆయుష్ ఆసుపత్రిలో రోజుకు 100 నుంచి 120 మంది రోగులు వైద్య సేవలు వినియోగించుకుంటున్నారని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మందులు, వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని జిల్లా ప్రజలు వైద్య సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ అన్నారు. అంతకంటే ముందు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రకరకాల యునాని, ఆయుర్వేదిక్, హోమియోపతి మెగా వైద్య శిబిర మందుల ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా ఆరోగ్య వైద్యశాఖ అధికారి డాక్టర్. ప్రమోద్ కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్. శ్రీధర్, ఆయుష్ వైద్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.