టికెట్లపై కొనసాగుతున్న సస్పెన్స్
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:23 AM
మున్సిపల్ ఎన్నికలు జిల్లాలో రసవత్తరంగా మారాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలు బీ ఫారాలను అంద జేయక పోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయా పార్టీల నుంచి ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్లు వేసిన వారికి బీ ఫారాలు వస్తాయనే భరోసాతో ఉన్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మున్సిపల్ ఎన్నికలు జిల్లాలో రసవత్తరంగా మారాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలు బీ ఫారాలను అంద జేయక పోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయా పార్టీల నుంచి ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్లు వేసిన వారికి బీ ఫారాలు వస్తాయనే భరోసాతో ఉన్నారు. వచ్చిన చిక్కంతా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసిన వారితోనే ఉంది. ప్రత్యర్థులను బట్టి ఆయా పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో నిలపా లని భావిస్తున్నాయి. గట్టి పోటీనిచ్చే అభ్యర్థులు మినహా మిగతా వారిని పోటీ నుంచి విరమింపజేసేందుకు నాయకులు బుజ్జగించేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి అత్యధిక మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుల ఆధారంగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది.
పార్టీల వారీగా నామినేషన్లు
నామినేషన్ల గడువు ముగిసే నాటికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో 124 డివిజన్లు, వార్డుల్లో మొత్తం 1,161 నామినేషన్లు వచ్చాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆప్ పార్టీ నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి 31 మంది, బీజేపీ నుంచి 171 మంది, సీపీఐ(ఎంఎల్) నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి 368 మంది, ఏఐఎం ఐఎం నుంచి ఆరుగురు, బీఆర్‌ఎస్ నుంచి 259 మంది, తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు, జనసేన నుంచి 10 మంది, ఏఐఎఫ్‌బీ నుంచి 59 మంది, ఇతర రిజిష్టర్డ్ పార్టీల నుంచి 90 మంది, స్వతంత్రులు 159 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
3 వరకు ఉపసంహరణలకు గడువు..
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ లోపు రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు పార్టీ బీ ఫారాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలి. లేకుంటే ఆ అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థుల జాబితాలో చేర్చి పార్టీ గుర్తు గాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుల్లో నుంచి ఒక గుర్తును కేటాయిస్తారు. పార్టీ గుర్తులు ఉంటే బ్యాలెట్ పత్రాల్లో ముందు వరుసలో గుర్తు ఉంటుంది. పార్టీ గుర్తు లేకుంటే కింది వరసలో వస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లు 17వ తేదీన ప్రకటించగా, ఎన్నికల షెడ్యూల్‌ను 27వ తేదీన ప్రకటించి మరుసటి రోజు నుంచే నామినేషన్లు స్వీకరించింది. ఈ లోపు ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పది రోజులు గడువు ఉన్నప్పటికీ, 70 నుంచి 80 శాతం మంది అభ్యర్థులనే ఎంపిక చేశారు. ఎంపిక చేసిన అభ్యర్థులతోపాటు అదే పార్టీకి చెందిన అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 368 మంది నామినేషన్లు వేశారు. మంథనిలో 13 వార్డులు ఉంటే 83 మంది, పెద్దపల్లిలో 36 వార్డులుంటే 103 మంది, రామగుండంలో 60 డివిజన్లు ఉంటే 135 మంది దాఖలు చేశారు. సుల్తానాబాద్‌లో 15 వార్డులుంటే 47 మంది నామినేషన్లు వేశారు. ఇందులో కొందరు డమ్మీగా నామినేషన్లు వేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం మేరకు బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలి. బీసీ రిజర్వేషన్ స్థానాలు పోనూ జనరల్ స్థానాల్లో మరికొందరు బీసీ అభ్యర్థులకు స్థానం కల్పించాల్సి ఉంటుంది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కూడా 259 మంది నామినేషన్లు వేసినప్పటికీ, మంథనిలో 44 మంది, పెద్దపల్లిలో 77 మంది, రామగుండంలో 102 మంది, సుల్తానాబాద్‌లో 36 మంది నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 171 మంది నామినేషన్లు వేయగా, మంథని నుంచి 16 మంది, పెద్దపల్లి నుంచి 50 మంది, రామగుండం నుంచి 75 మంది, సుల్తానాబాద్ నుంచి 30 మంది నామినేషన్లు వేశారు. పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. కొందరు అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేసేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జీలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులు కల్పిస్తామంటూ హామీలు ఇస్తూ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారో, ఎవరు రెబల్స్‌గా మారతారో తెలియదు. ఈ ఉత్కంఠ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనున్నది.