Share News

అక్రమ దందాలపై నిఘా

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:00 AM

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్‌ను పునరుద్ధరించారు. కమిషనర్‌గా అంబర్‌ కిశోర్‌ ఝా బాధ్యతలు తీసుకున్న తరువాత టాస్క్‌ఫోర్స్‌ను రద్దు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని నార్కోటిక్‌ విధులకు వినియోగించారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో గతంలో టాస్క్‌ఫోర్స్‌పై అనేక ఆరోపణలు రావడంతో కొత్తగా బాధ్యతలు తీసుకున్న అంబర్‌ కిశోర్‌ ఝా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అక్రమ దందాలపై నిఘా

కోల్‌సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్‌ను పునరుద్ధరించారు. కమిషనర్‌గా అంబర్‌ కిశోర్‌ ఝా బాధ్యతలు తీసుకున్న తరువాత టాస్క్‌ఫోర్స్‌ను రద్దు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని నార్కోటిక్‌ విధులకు వినియోగించారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో గతంలో టాస్క్‌ఫోర్స్‌పై అనేక ఆరోపణలు రావడంతో కొత్తగా బాధ్యతలు తీసుకున్న అంబర్‌ కిశోర్‌ ఝా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఎస్‌హెచ్‌ఓలు, సిబ్బందే పటిష్టమైన శాంతిభద్రతల విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మధ్య కాలంలో కమిషనరేట్‌ పరిధిలో పేకాట, పీడీఎస్‌ అక్రమ రవాణా, బొగ్గు, స్ర్కాప్‌ దొంగతనాలు పెరిగిపోయాయి. హోటళ్లు, లాడ్జిలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్‌లో నగల షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠా పెద్దపల్లిలోని ఒక లాడ్జిలో షల్టర్‌ తీసుకొన్న విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో కొత్త డీజీపీ సీవీ ఆనంద్‌ కూడా శాంతిభద్రతల విషయంలో అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా సీపీ స్థాయి అధికారులు సైతం రోజు సాయంత్రం కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, ఎస్‌హెచ్‌ఓలు ఠాణాలు విడిచి రోడ్లపై విధులు నిర్వర్తించాలని, బాధితుల వద్దకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, పోలీస్‌శాఖ ప్రతిష్ట పెంచే విషయంలో పోలీసులకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇస్తున్నారు. రామగుండం కమిషనరేట్‌కు నూతనంగా టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీని కేటాయించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ విధులను మళ్లీ పునరు ద్ధరించారు. ఇప్పటికే కమిషనరేట్‌ పరిధిలో పేకాట స్థావరాలు, పీడీఎస్‌ రవాణాపై నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తోంది. ఆగస్టు నుంచి పీడీఎస్‌ మూడు నెలల కోటా ఒకేసారి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. రెండు జిల్లాల్లో అక్రమ దందాలను కట్టడి చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Updated Date - Jul 26 , 2026 | 12:00 AM