Share News

వీధి వ్యాపారులకు వెన్నుదన్నుగా..

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:40 AM

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి(ఆత్మనిర్భర్‌ నిధి) ద్వారా అందిస్తున్న రుణాలు వీధి వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. 2020 జూన్‌ మాసంలో ప్రారంభమైన స్వనిధి పథకం ప్రక్రియ మధ్యలో నిలిచిపోవడంతో స్ట్రీట్‌ వెండర్లు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ గత సంవత్సరం నవంబర్‌లో రుణాల పంపిణీ పునరుద్ధరించడంతో పాటు ఎలాంటి హామీలు, షూరిటీలు లేకుండానే కేవలం నిమిషాల వ్యవధిలోనే రుణాలను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో అందించడానికి వీధి వ్యాపారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వీధి వ్యాపారులకు వెన్నుదన్నుగా..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి(ఆత్మనిర్భర్‌ నిధి) ద్వారా అందిస్తున్న రుణాలు వీధి వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. 2020 జూన్‌ మాసంలో ప్రారంభమైన స్వనిధి పథకం ప్రక్రియ మధ్యలో నిలిచిపోవడంతో స్ట్రీట్‌ వెండర్లు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ గత సంవత్సరం నవంబర్‌లో రుణాల పంపిణీ పునరుద్ధరించడంతో పాటు ఎలాంటి హామీలు, షూరిటీలు లేకుండానే కేవలం నిమిషాల వ్యవధిలోనే రుణాలను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో అందించడానికి వీధి వ్యాపారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి పథకం రుణాలపై లోక్‌ కల్యాణ్‌ మేళా రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో ఇప్పటి వరకు స్వనిధి ద్వారా రూ.28.70 కోట్ల రుణాల పంపిణీ జరిగింది. ఈనెల 30వ తేదీ వరకు లోక్‌ కల్యాణ్‌ మేళా మాసోత్సవాన్ని నిర్వహిస్తారు. వీధివ్యాపారులకు రుణ సౌకర్యం, సంక్షేమ మద్దతు, డిజిటల్‌ సాధికారత, వీధి వ్యాపారుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు కొత్తగా స్ట్రీట్‌ వెండర్లను గుర్తించి క్రెడిట్‌ కార్డులను అందించడం వంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ పరిధిలో మెప్మా ద్వారా ఆధార్‌ కార్డు అర్హతగా తొలివిడతగా రూ.15 వేలు, రెండో విడతగా రూ.25వేలు, మూడో విడతగా రూ.50వేల చొప్పున అందిస్తారు. వీధి వ్యాపారులు తమ ఆధార్‌ కార్డు, ఒక ఫొటో, ఆధార్‌ కార్డుకు లింకు అయిన ఫోన్‌ నంబర్‌, బ్యాంకు ఖాతా పాస్‌పుస్తకం, జిరాక్స్‌ ఇస్తే సరిపోతుంది. వీధివ్యాపారులు మాత్రం పక్కా భవనంలో వ్యాపారం చేయకుండా నాలుగు చక్రాల బండ్లు, వీధుల వెంట చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారై ఉండాలి. వీరిని గుర్తిస్తూ రుణాల పంపిణీ చేస్తున్నారు.

జిల్లాలో 10,738 మంది వీధి వ్యాపారులు

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 10738మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వీధి వ్యాపారులకు చేయూతనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా రుణాల ప్రక్రియ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో 2020లో ప్రారంభించారు. వీధి వ్యాపారులకు రుణాలు అందించి చిరువ్యాపారాన్ని కొనసాగించుకునే దిశగా మూడు విడతలుగా రుణాలను అందించారు. 2024 డిసెంబర్‌లో స్వనిధి పథకం రుణాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి తిరిగి 2025 నవంబర్‌లో పునరుద్ధరించారు. ప్రస్తుతం రుణాలు తొలివిడత రూ.10వేల నుంచి రూ.15 వేలకు, రెండో విడత రూ.20వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. మూడో విడత యథావిధిగా రూ.50వేలు ఇస్తున్నారు. స్వనిధి పథకం ప్రారంభించిన తర్వాత 2024 డిసెంబర్‌ వరకు తొలి విడతలో 8,487 మంది వీధి వ్యాపారులు రూ.10వేల రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, 7967 మందికి రుణాలు ఇచ్చారు. రెండో విడతలో 6581 మంది వ్యాపారుల రుణం చెల్లించడంతో తిరిగి 6194మందికి రూ.20వేల చొప్పున రుణాలు ఇచ్చారు. మూడో విడతలో 2543 మంది విక్రయిదారులు తీసుకున్న రుణం చెల్లించడంతో తిరిగి 1290 మంది వ్యాపారులకు రూ.50 వేల చొప్పున రుణం ఇచ్చారు. తాత్కాలికంగా నిలిచిపోయిన పథకం తిరిగి 2025 నవంబర్‌లో స్వనిధి పథకం పునరుద్ధరించిన తర్వాత మొదటి విడతలో 170 మందికి రూ.15వేల చొప్పున, రెండో విడతలో 73 మంది రుణం చెల్లించడంతో 59 మందికి రూ.25 వేల చొప్పున తిరిగి రుణాలను అందించారు. మూడో విడతలో రెండో లోన్‌ పూర్తిచేసిన 300 మందికి రూ.50 వేల చొప్పున రుణాలను అందించారు. ప్రస్తుతం లోక్‌ కల్యాణ్‌ మేళా ద్వారా వీధి వ్యాపారులకు రుణాలు అందించే ప్రక్రియ వేగంగా కొనసాగిస్తున్నారు.

వీధి వ్యాపారులకు రుణాలతో చేయూత

- మిర్జా ఫసహాద్‌ బేగ్‌, ఏవో మెప్మా

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో వీధి వ్యాపారులకు రుణాలతో ఆర్థిక చేయూత కల్పించేందుకు ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా రుణాలను అందిస్తున్నాం. లోక్‌ కల్యాణ్‌ మేళా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇందులో కొత్తగా స్ట్రీట్‌ వెండర్స్‌ను గుర్తించి వారికి కార్డులను అందించడంతోపాటు రుణాలు కూడా ఇప్పిస్తాం. ప్రధానమంత్రి నిధి రుణాలను విధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - Sep 06 , 2026 | 12:40 AM