అర్హత ఉన్న వారికే ’ఆసరా...’
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:23 AM
ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అర్హులైన వారినే ఎంపిక చేసేలా నిబంధన పెట్టింది. ఈ మేరకు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక డిజెగ్నేటెడ్ వెరిఫైడ్ ఆఫీసర్(ధ్రువీకరణ అధికారులు) (డీవీవో)లను నియమించనున్నది.
కోల్‌సిటీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అర్హులైన వారినే ఎంపిక చేసేలా నిబంధన పెట్టింది. ఈ మేరకు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక డిజెగ్నేటెడ్ వెరిఫైడ్ ఆఫీసర్(ధ్రువీకరణ అధికారులు) (డీవీవో)లను నియమించనున్నది. మండల స్థాయిలో ఎంపీడీవోలు, మండల పంచాయతీ ఆఫీసర్లు, సూపరింటెండెంట్ ర్యాంకు పైస్థాయి అధికారులను డీవీవోలుగా నియమిస్తారు. వీరికి ఎంపీడీఓలు లాగిన్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో సూపరింటెండెంట్లు, రెవెన్యూ ఆఫీసర్లు, ప్లానింగ్ అధికారులు, సీనియర్ అసిస్టెంట్ పైస్థాయి అధికారులను డీవీవోలుగా నియమించాల్సి ఉంది. వీరికి మున్సిపల్ కమిషనర్ లాగిన్ ఇస్తారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్‌లలో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషన్, సూపరింటెండెంట్లు, రెవెన్యూ ఆఫీసర్లు డీవీవోలుగా వ్యవహరిస్తారు. డిప్యూటీ కమిషన్ లాగిన్ ఇవ్వాల్సి ఉంటుంది.
సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా
మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో వచ్చిన దరఖాస్తులను వార్డులు, డివిజన్ల వారీగా విభజిస్తారు. సంబంధిత డీవీవోలకు పంపుతారు. విచారణకు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. విచారణాధికారులు దరఖాస్తుదారుల నివాసాలకు వెళ్లి విచారణ జరపాల్సి ఉంటుంది. వారి నివాస గృహాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఒక వేళ తిరస్కరిస్తే ఏ కారణంతో తిరస్కరించారో యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
అవకతవకలు జరిగితే డీవీవోలపై వేటే...
లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలు పాటించకున్నా, అవకతవకలకు పాల్పడి అనర్హులను ఎంపిక చేస్తే సంబంధిత డీవీవోలే బాధ్యులవుతారు. డీవీవోల సిఫార్సుల తరువాత మరోమారు ఆకస్మిక విచారణ జరుపుతారు. అనర్హులను ఎంపిక చేసినట్టు తేలితే సంబంధిత డీవీవోలపై చర్యలు తీసుకోవడంతో పాటు పెన్షన్ మంజూరు మొత్తాన్ని వారి వేతనాల నుంచి రికవరీ చేస్తారు.
మంజూరు అధికారం కలెక్టర్‌లదే...
డిజెగ్నేటెడ్ వెరిఫైడ్ ఆఫీసర్లు దరఖాస్తుల విచారణ జరిపి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ధ్రువీకరిస్తారు. విచారణ జరిపిన జాబితాను సెర్ఫ్ నుంచి కలెక్టర్లకు పంపుతారు. కలెక్టర్లే అంతిమంగా లబ్ధిదారులకు పెన్షన్ల మంజూరు చేస్తారు. కలెక్టర్ల ధ్రువీకరణ తరువాత క్షేత్రస్థాయిలో ప్రొసీడింగ్‌లు జారీ అవుతాయి.
దివ్యాంగులకు 40శాతం వైకల్యం ఉంటేనే అర్హత...
దివ్యాంగుల ఎంపికలో కనీసంగా 40శాతం వైకల్యం ఉంటేనే అర్హతగా భావిస్తారు. వినికిడి లోపంకు సంబంధించి 51శాతం ఉండాల్సి ఉంటుంది. వైకల్యం ధ్రువీకరణ పత్రాలతోపాటు సామాజిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
రామగుండంలో 3100దరఖాస్తులు
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆసరా పథకానికి సంబంధించి సోమవారం వరకు 3100దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1823 వితంతు, 440 ఒంటరి మహిళలు, 715 వికలాంగులు, 43 చేనేత, 79గీత కార్మికుల పెన్షన్ల కోసం దరఖాస్తులు వచ్చాయు. రోజు రెండు మూడు దరఖాస్తులే వస్తున్నాయి. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తున్నారు. 15వ తేది వరకు తుది గడువుగా ఉంది. 15తరువాత క్షేత్రస్థాయి పరిశీలన జరుగనున్నది.