వేసవి క్రీడోత్సవం
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:59 AM
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈనెల 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.
జగిత్యాల, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈనెల 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శిక్షకుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో పది మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు ఇవ్వనున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ప్రభుత్వం యేటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది.
క్రీడాంశాలు..
వేసవి శిక్షణ శిబిరంలో సుమారు 25 రకాల క్రీడలున్నాయి. ప్రధానంగా అథ్లెటిక్స్, అర్చరీ, బాస్కెట్ బాల్, బ్యాడ్మెంటన్, బాల్ బ్యాడ్మెంటన్, బాక్సింగ్, క్రికెట్, క్యారమ్, చెస్, జిమ్నాస్టిక్స్, హాండ్ బాల్, జూడో, కబడ్డీ, కరాటే, ఖోఖో, లాన్‌టెన్నిస్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వ్రెస్టింగ్, తైక్వాడో, మల్టీజిమ్, సాఫ్ట్‌బాల్, టెన్నికాయిట్, త్రోబాల్, నెట్‌బాల్, కిక్ బాక్సింగ్, వుషు, రోలర్ స్కేటింగ్, ఫుట్ బాల్, యోగా, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్ తదితర క్రీడలను నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, వాలీబాల్, తైక్వాండో, కరాటే ఏడు క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది.
అర్హులు ఎవరంటే..
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 14సంవత్సరాల్లోపు బాలబాలికలకు మాత్రమే అవకాశం ఉంటుంది. శిబిరాలకు వచ్చే విద్యార్థులు శిక్షకుల వద్ద పేర్లు నమోదు చేయించుకోవాలి. క్రీడా శిక్షణకు వచ్చే విద్యార్థులకు సంబంధించి ప్రతి రోజు హాజరు తీసుకుంటారు. శిక్షణ శిబిరాలల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ చివరి రోజు సర్టిఫికెట్లు అందజేస్తారు.
జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖకు నిర్వహణ బాధ్యతలు
వేసవి శిక్షణ శిబిరంలో సుమారు 25 రకాల క్రీడలు ఉండగా, వాటిలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆయా ప్రాంతాల్లోని క్రీడాకారులు ఎక్కువగా ఏ క్రీడకు మొగ్గు చూపితే దానినే ఎంపిక చేసుకునే అవకాశాలున్నాయి. క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్కోదానికి నిర్ణీత సొమ్ము మంజూరు చేస్తోంది. వాటితో క్రీడా మైదానం చదును, క్రీడాకారులకు తాగునీరు, తదితర అవసరాలకు ఉపయోగిస్తారు. క్రీడలు ముగిశాక ఒక్కో శిక్షణ శిబిరానికి రెమ్యూనరేషన్ కింద ఒక్కో దానికి రూ. 5 వేల నుంచి పదింటికి మొత్తం రూ.50 వేలు ఖర్చు చేయనున్నారు. జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ అధికారి నిర్వహణ బాధ్యతలతో పాటు పర్యవేక్షణ చేయనున్నారు. కాగా శిబిరాలకు వచ్చే విద్యార్థులకు దాతల చేయూతతో స్నాక్స్ ఇవ్వనున్నారు.
అర్బన్‌లో నిర్వహించే క్రీడలకు ఫీజు..
జిల్లా వ్యాప్తంగా పలు వేసవి శిక్షణ శిభిరాలను నిర్వహించనుండగా, వాటిలో అర్బన్ ప్రాంతంలో సగం, గ్రామీణ ప్రాంతంలో మరో సగం చొప్పున నిర్వహించాల్సి ఉంటుంది. కాగా ఇందులో అర్బన్ ప్రాంతాల్లో క్రీడాకారుల నుంచి ఒక్కో క్రీడకు ఒక్కో రకమైన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే రూరల్ ఏరియాలో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఫీజు లేకుండానే ఉచితంగానే పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్బన్ క్రీడల్లో ముఖ్యంగా అథ్లెటిక్స్ క్రీడాకారుడు రూ.400 చొప్పున చెల్లించాలి. బాస్కెట్ బాల్‌కు రూ.400, బ్యాడ్మింటన్ రూ.1,000, బాక్సింగ్ రూ.100, తైక్వాండో రూ.100, వాలిబాల్ రూ.100, కరాటే రూ.200 చొప్పున ఫీజు నిర్ణయించారు.
సద్వినియోగం చేసుకోండి
- రవికుమార్, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి
జిల్లాలో మేలో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో 5, రూరల్ ప్రాంతాల్లో 5 చొప్పున మొత్తం 10 క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాము. శిక్షకుల ఎంపికకు దరఖాస్తులను స్వీకరించాము. విద్యార్థులు వేసవి సెలవుల్లో ఈ క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.