సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఏకగ్రీవం
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:44 PM
సుల్తానాబాద్ మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మెల్యే సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఈ నెల 16న జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో ఏకాభిప్రాయం సాధించడంలో జరిగిన అలస్యంతో మంగళవారం నిర్వహించారు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మెల్యే సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఈ నెల 16న జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో ఏకాభిప్రాయం సాధించడంలో జరిగిన అలస్యంతో మంగళవారం నిర్వహించారు. ఈ నెల 13న ఫలితాలు వెలువడిన రోజు నుంచి క్యాంపునకు బయలుదేరి వేళ్ళిన కౌన్సిలర్లు తిరిగి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి బస్సులో చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. సభ్యులందరినీ ఎమ్మెల్యే నేరుగా సమావేశ హాల్‌కు తీసుకువెళ్ళారు.
కౌన్సిలర్లుగా ఎన్నికైన పదిహేను మందిచే జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే విజయరమణారావు కూడా ఎక్స్‌అఫీషియోగా ఓటు నమోదు చేసుకున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్‌గా నాలుగవ వార్డు కౌన్సిలర్ బిరుదు రాధాక్రిష్ణను, వైస్ చైర్మన్‌గా పదవ వార్డు కౌన్సిలర్ అంతటి పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పది మంది కాంగ్రెస్ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్‌లకు మద్దతు తెలిపారు. సమావేశం హాల్‌లో ఒక వైపు పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు సీటింగ్ ఏర్పాటు చేయగా మరో వైపు వరుసగా బీజేపీ, బీఆర్‌ఎస్, ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ప్రమాణ స్వీకారంలో కమిషనర్ రమేష్, అధికారులు పాల్గొన్నారు.
మాట నిలుపుకున్న ఎమ్మెల్యే
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవిని బిరుదు కుటుంబానికి కట్టబెట్టిన ఎమ్మెల్యే విజయరమణారావు మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాటను నిజం చేయడానికి ఎమ్మెల్యే తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. చివరకు మొదటి నుంచి చెబుతున్నట్లుగా బిరుదు రాజమల్లు కుమారుడు రాధాక్రిష్ణకు చైర్మన్ పదవిని కట్టబెట్టి నిజాయితీని చాటుకున్నారు. గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయరమణారావు గెలుపునకు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కృషి చేశారు. బిరుదు రాజమల్లు చేసిన సేవలకు గుర్తింపుగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే విజయరమణారావు వారి కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెడతానని మాట ఇచ్చారు. అయితే శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి చెందారు. రాజమల్లు కుటుంబానికి ఎమ్మెల్యే అండగా నిలిచారు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా మున్సిపల్ కార్యాలయం ఎదుట బిరుదు రాజమల్లు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. మున్సిపల్ ఎన్నికలలో నాలుగవ వార్డు నుంచి రాజమల్లు పెద్ద కుమారుడు బిరుదు రాధాక్రిష్ణకు పార్టీ టిక్కెట్టు ఇప్పించి గెలుపునకు కృషి చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ ఐల రమేష్ ఇదే వార్డు నుంచి పోటీ చేస్తారని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడి ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేశారు. మున్సిపాలిటీలో 12 మంది అభ్యర్థులు గెలుపొందగా చైర్మన్ పదవిని బిరుదు కుటుంబానికి అంటూ ఎమ్మెల్యే చెబుతు వస్తున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో స్పష్టం చేశారు. అయితే సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గిరీ పై కన్నేసిన ఇద్దరు నేతల్లో పదవిని పొందడానికి విశ్వప్రయాత్నాలు చేశారు. ఎమ్మెల్యే పై అనేక ఒత్తిళ్లు తెచ్చారు. అనేక సమీకరణలు, అంశాలను తెరమీదకు తెచ్చి తమకు ఇవ్వాల్సిందేనంటూ పావులు కదిపారు. ఎట్టకేలకు ఆ నేతల అలకలను తీర్చడంలో కూడా ఎమ్మెల్యే సఫలీకృతం అయ్యారు. బుజ్జగింపులు, భవిష్యత్తు హమీలు వంటి వాటితో అందరినీ ఐక్యంగా నిలబెట్టి మున్సిపల్ ఎన్నికను ప్రశాంతంగా తాను అనుకున్న విధంగా పూర్తి చేయించారు.