విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:16 AM
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వరాదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చేపట్టాల్సిన అంశాలపై కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వరాదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చేపట్టాల్సిన అంశాలపై కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఎలుకలు, పాముకాట్లు, ఆహార కలుషిత ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పిచ్చి మొక్కలు, పొదలను తొలగించాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు 10 రోజులకు ఒకసారి సందర్శించాలని ఆదేశించారు. నాణ్యమైన సరుకులను మాత్రమే స్వీకరించాలని సూచించారు. వంట ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, నిర్దేశిత ప్రామాణిక విధానాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఆహారం నాణ్యత, పరిమాణం విషయంలో రాజీ పడకూడదన్నారు. కిటికీలకు మెష్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యాసంస్థల పరిసరాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ సిబ్బంది రెసిడెన్షియల్ విద్యాసంస్థలను సందర్శించి తాగునీటి నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులు క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనే సమయంలో పర్యవేక్షణ లేకుండా వదిలివేయరాదన్నారు. డీఈవో శారద, సంబంధిత శాఖల అధికారులు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల అధికారులు, ఎంపీడీవోలు, అధికారులు, పాల్గొన్నారు.