Share News

సింగరేణిలో సమ్మె సక్సెస్‌

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:50 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని జాతీ య కార్మికసంఘాలు గురువారం తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మె సింగరేణిలో విజయవంతం అయ్యింది. సంస్థలోని 40వేల మంది కార్మికులు ఈ సమ్మెను సమర్థిస్తూ గురువారం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.

సింగరేణిలో సమ్మె సక్సెస్‌

గోదావరిఖని, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని జాతీ య కార్మికసంఘాలు గురువారం తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మె సింగరేణిలో విజయవంతం అయ్యింది. సంస్థలోని 40వేల మంది కార్మికులు ఈ సమ్మెను సమర్థిస్తూ గురువారం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణి అండర్‌ గ్రౌండ్‌ గనులు, ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు, వివిధ విభాగాల్లో పని చేసే కార్మికవర్గమంతా సమ్మెలో పాల్గొన్నది. అత్య వసర సర్వీసులు మినహా సింగరేణిలో గురువారం ఈ సమ్మె కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. జాతీయకార్మిక సంఘం బీఎంఎస్‌ సమ్మెకు దూరంగా ఉంది. ఈ కారణంగా బీఎంఎస్‌కు సంబంధించిన కొందరు కార్మికులు అక్కడక్కడ విధులకు హాజరైనప్పటికీ ప్రభా వశీలమైన ఉత్పత్తికి ఈ హాజరుశాతం దోహదపడలేదు. కాగా ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ లాంటి జాతీయ సంఘాలు ఈ సమ్మెను విజయవంతం చేసేందుకు వారం రోజులుగా ప్రచారం నిర్వహించడంతో పాటు గురువారం సమ్మె జరిగేలా ప్రయత్నించాయి. సింగరేణిలో సమ్మె విజయవంతానికి జాతీయ కార్మిక సంఘాలతో పాటు టీబీజీకేఎస్‌, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ సంఘాలు కూడా సింగరేణిలో సమ్మెను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సమ్మె కారణంగా సింగరేణి సంస్థకు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. కాగా సింగరేణి కార్మికవర్గం ఒక రోజు వేతనాలు సుమారు రూ.10కోట్లు నష్టపోయారు. గురువారం సింగరేణి వ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ప్రదర్శనలు, రాస్తారాకోలు, ధర్నాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కోడ్‌లను రద్దుచేయాలని, ప్రభుత్వరంగంలో జరుగుతున్న ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశాయి. లేని పక్షంలో దేశ వ్యాప్తంగా కార్మికవర్గాన్ని ఏకం చేసి దీర్థ కార్మిక సమ్మెలను కూడా చేపడుతామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. సమ్మెను విజయవంతం చేసిన సింగరేణి కార్మికవర్గానికి జేఏసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి జాతీయ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులో సింగరేణికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించాయి. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చాలని, మెడికల్‌ బోర్డును యధావిధిగా నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, డిస్మిస్‌ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని, సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని జేఏసీ సంఘాలు సమ్మె సందర్భంగా డిమాండ్‌ చేశాయి.

Updated Date - Feb 12 , 2026 | 11:50 PM