Share News

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:16 AM

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 14న శనివారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 7495 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

పది పరీక్షలకు  పకడ్బందీ ఏర్పాట్లు

పెద్దపల్లి కల్చరల్‌, మార్చి12(ఆంధ్రజ్యోతి): పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 14న శనివారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 7495 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అలాగే మరో 27 మంది విద్యార్థులు ప్రైవేటుగా రాయనున్నట్లు జిల్లా విద్యాధికారి శారద తెలిపారు. జిల్లాలో 3787 మంది బాలికలు, 3708 మంది బాలురు పరీక్షలు రాస్తారన్నారు. ఈ పరీక్షలకు ఐదు నిమిషాల ఆలస్యంను పరిగణలోకి తీసుకుంటామని, మొబైల్‌ ఫోన్‌లు పరీక్ష హాలులోకి అనుమతి లేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాయడానికి అన్ని రకాల చర్యలు, సదుపాయాలు కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ సెంటర్లను మూసివేసేలా పోలీసులతో ఆదేశాలు ఇప్పించినట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని, 41 పరీక్ష కేంద్రాలకు 41 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులను సిద్ధం చేశామన్నారు. హాల్‌ టికెట్లు మరిచిపోయినా, ప్రైవేటు యాజమాన్యాలు ఇవ్వకుండా ఇబ్బందులు కలిగిస్తే ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు. అలాగే 8096958096 నెంబర్‌కు హాయ్‌ అని మేసేజ్‌ ద్వారా హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకావద్దని, భయపడవద్దని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ప్రశాంతంగా బయటకి రావాలని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాగా 41 పరీక్ష కేంద్రాలలో 31 పరీక్ష కేంద్రాలను బి కేటగిరి కింద ఆయా పోలీస్‌స్టేషన్లకు 8 కిలోమీటర్ల పరిధిలో ఉండేలా ఏర్పాటు చేశామని, మరో 10 పరీక్ష కేంద్రాలను పోలీస్‌స్టేషన్‌కు దూరమున్న కేంద్రాలను సి కేటగిరి కింద నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఆయా కేంద్రాలకు సరైన సమయంలో అధికార యంత్రాంగమంతా అందుబాటులో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె తెలిపారు.

Updated Date - Mar 13 , 2026 | 12:16 AM