Share News

పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 08 , 2026 | 11:30 PM

బక్రీద్‌ పండుగ నేపథ్యంలో పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. శుక్రవారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో స్లాటర్‌ హౌస్‌ నిర్వాహకులతో సీపీ సమావేశం నిర్వహించారు.

పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

కోల్‌సిటీ, మే 8(ఆంధ్రజ్యోతి): బక్రీద్‌ పండుగ నేపథ్యంలో పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. శుక్రవారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో స్లాటర్‌ హౌస్‌ నిర్వాహకులతో సీపీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలీస్‌శాఖకు సహకరించాలని సూచించారు. పశువుల కొనుగోలు, రవాణా, వధ ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, కోర్టు మార్గదర్శకాలు పాటించాలని, రవాణా సమయంలో జంతువులకు సరైన సంరక్షణ కల్పించాలని, తనిఖీల సమయంలో పోలీస్‌, వెటర్నరీ, రవాణా శాఖ అధికారులకు సహకరించాలని సూచించారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా నకిలీ లేదా చెల్లని వెటర్నరీ సర్టిఫికెట్లు ఉపయోగించరాదని, అనుమతి లేని ప్రదేశాల్లో జంతువుల వధ, బహిరంగ ప్రదేశాల్లో మాంసం విక్రయాలు జరుపరాదన్నారు. సోషల్‌ మీడియాలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే వీడియోలు, ఫొటోలు షేర్‌ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగ సమయంలో ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సామరస్య వాతావరణం నెలకొనేలా నిర్వాహకులు వ్యవహరించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలు అయినా ఉపేక్షించమని సీపీ హెచ్చరించారు. అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేందర్‌గౌడ్‌, మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు, బెల్లంపల్లి సీఐ అనూప్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్లు భీమేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2026 | 11:30 PM