Share News

ఇంకా.. సరిపోలేదు..

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:51 AM

అల్పపీడన ప్రభావంతో జిల్లాను వర్షాలు ముంచెత్తుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. గడిచిన మూడు రోజులుగా ఎంతగానో ఊరించిన వానలు అంతలోనే ఉసూరుమనిపించాయి. మోస్తారును మించి వర్షం కురవలేదు.

ఇంకా.. సరిపోలేదు..

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

అల్పపీడన ప్రభావంతో జిల్లాను వర్షాలు ముంచెత్తుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. గడిచిన మూడు రోజులుగా ఎంతగానో ఊరించిన వానలు అంతలోనే ఉసూరుమనిపించాయి. మోస్తారును మించి వర్షం కురవలేదు. కురిసిన తేలికపాటి వర్షాలతో పంటలకు కాస్త ఉపశమనం కలిగినా.. ఈ సీజన్‌లో కరువు దరిదాపుల్లోకి రాకుండా పుష్కలమైన నీళ్లు వస్తాయని భావించిన రైతాంగాన్ని వరుణుడు నిరాశపర్చాడు. రోజంతా మబ్బులు కమ్మిన వాతావరణమే కనిపించినా.. సాధారణ వానలే పడ్డాయి. శుక్రవారం రోజు ఉదయం కొద్దిసేపు మాత్రమే చినుకులు పడగా.. రాత్రి వరకు జల్లుల ఊసే లేదు.

ఈ సీజన్‌లో వర్షపాతం (మిల్లీమీటర్లలో)

--------------------------------------------------

మండలం సాధారణం కురిసింది వ్యత్యాసం(శాతం)

--------------------------------------------------

గంగాధర 675.9 841.3 24

రామడుగు 639.1 921.2 44

చొప్పదండి 786.2 760.8 -3

కరీంనగర్‌రూరల్‌ 744.4 653.4 -12

కొత్తపల్లి 745.6 611.3 -18

గన్నేరువరం 658.2 828.2 26

కరీంనగర్‌ 753.6 683.3 -9

మానకొండూర్‌ 689.5 697.0 1

తిమ్మాపూర్‌ 717.6 688.2 -4

చిగురుమామిడి 617.6 669.7 8

సైదాపూర్‌ 633.8 663.9 5

శంకరపట్నం 710.3 682.5 -4

వీణవంక 706.2 476.9 -32

హుజూరాబాద్‌ 764.2 507.0 -34

జమ్మికుంట 771.1 574.1 -26

ఇల్లందకుంట 767.5 564.7 -26

--------------------------------------------------

జిల్లా సగటు 711.3 676.5 -5

--------------------------------------------------

సగటున 34.8 మిల్లీమీటర్లు తక్కువగా..

జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు పడిన వానల్లో ఇంకా 5 శాతం లోటు వర్షపాతం నెలకొంది. ఈనెల 25వ తేదీ వరకు పడిన వానలు తక్కువగా కురవడతో కొన్ని మండలాల్లో గణనీయమైన లోటు కనిపిస్తోంది. హుజూరాబాద్‌ మండలంలో ఏకంగా 34 శాతం లోటు ఉంది. సాధారణంగా పడాల్సిన వానకన్నా 257.2 మిల్లీమీటర్లు తక్కువగా కురిసింది. వీణవంక మండలంలోనూ 32 శాతం లోటు ఉంది. ఇక్కడ కూడా 229.3 మిల్లీమీటర్ల తక్కువగా కురిసింది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. మొత్తంగా జిల్లాలోని వర్షపాతం గణాంకాల్ని గమనిస్తే 34.8 మిల్లీమీటర్ల లోటు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి జిల్లాలో 28 శాతం ఎక్కువగా వర్షం కురిసింది. జిల్లా సగటు సాధారణ వర్షపాతం 733.2 మిల్లీమీటర్లకు 935.5 మిల్లీమీటర్ల వర్షం పడింది.

మూడు మండలాల్లో సాధారణానికి మించి..

ఈ వర్షాకాలంలో గంగాధర, రామడుగు, గన్నేరువరం మండలాల్లో సాధారణానికి మించి వర్షం కురిసింది. ఈ మండలాల్లో చెరువులు పలు చోట్ల అలుగులు పారాయి. మరో తొమ్మిది మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వీణవంక, హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో భారీ లోటు కనిపిస్తోంది. మూడు రోజుల అల్పపీడన ప్రభావం వల్ల ఈనెల 23న జిల్లాలో మొత్తంగా 37.3, 24, 25 తేదీల్లో 216.2 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఈ నెలాఖరులోపు మరిన్ని జల్లులు పడితేనే జిల్లాలో ఉన్న జలాశయాలతోపాటు చెరువులు కుంటలు నిండే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి జిల్లావ్యాప్తంగా పెద్ద చెరువుల్లో వంద శాతం నీళ్లు నిండిన దాఖలాలు లేవు. దీంతో వానలపై ఆశతో వీటి ఆయకట్టు కింద పంటల్ని సాగు చేసిన కర్షకులు భారీ వర్షాల కోసం ఇంకా నిరీక్షిస్తున్నారు. వర్షకాలం సీజన్‌ ముగిసే దశకు చేరుకుంటున్నా.. ఇంకా కొన్ని రోజుల్లో దండిగా వానలు పడాతాయనే ఆకాంక్షతో అన్నదాతలున్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:51 AM