ఏకగ్రీవం వైపు అడుగులు..
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:45 AM
చేనేత సహకార సంఘాలకు సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 11 చేనేత, పవర్‌లూమ్ సహకార సంఘాలకు ఎన్నికలు జరగనుండడంతో సొసైటీ సభ్యుల్లో సందడి నెలకొంది. జిల్లాలో ఎన్నికల పోరు ఏకగ్రీవంగానే
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
చేనేత సహకార సంఘాలకు సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 11 చేనేత, పవర్‌లూమ్ సహకార సంఘాలకు ఎన్నికలు జరగనుండడంతో సొసైటీ సభ్యుల్లో సందడి నెలకొంది. జిల్లాలో ఎన్నికల పోరు ఏకగ్రీవంగానే ముగుస్తుందని భావిస్తున్నారు. చేతులెత్తే విధానంలో నిర్వహించే ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. గురువారం ఇందుకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ సంతోష్ కుమార్ పరిశీలించారు. సొసైటీలో ముందస్తుగానే చర్చల ద్వారా పాలకవర్గంలో ఎవరు ఉండాలో నిర్ణయించుకున్నట్లు చర్చించుకుంటున్నారు. 2013లో ఎన్నికలు జరగగా, ఎన్నికైన పాలకవర్గాల గడువు 2018 సంవత్సరంలో ముగిసింది. అప్పటినుంచి గత బీఆర్‌ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలకవర్గాల పదవీకాలం గడువును పొడిగిస్తూ వచ్చాయి. ఇప్పటివరకు 16సార్లు పాలకవర్గం పదవీ కాలాన్ని పొడిగించారు. ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఎట్టకేలకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేనేత సొసైటీలకు ఎన్నికలు నిర్వహణ ప్రారంభించింది. మొదటి విడత ఎన్నికలు ఈనెల 12వ తేదీన నిర్వహించారు. కొద్దిగా ఆలస్యంగా శుక్రవారం జిల్లాలో నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
9 మందితో పాలకవర్గం
జిల్లాలో చేనేత, పవర్‌లూమ్ సహకార సంఘాల పాలకవర్గాలు 9 మంది డైరెక్టర్లు ఉంటారు. అందులో ఇద్దరు మహిళలు ఉండేలా ఎన్నుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్ల ఎన్నిక తర్వాత వెంటనే, చైర్మన్, వైస్‌చైర్మన్, కార్యదర్శి, కోశాధికారి ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లాలో 11 సొసైటీలో 321 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 256 మంది, మహిళా కార్మికులు 65 మంది ఉన్నారు. వేములవాడ సొసైటీలో 36 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 30 మంది, మహిళలు 6 మంది ఉన్నారు. హనుమాజీపేట సొసైటీలో 32 మంది ఉండగా, పురుషులు 25 మంది, మహిళలు 7 మంది, మామిడిపల్లిలో 47మంది ఓటర్లు ఉండగా, పురుషులు 34 మంది, మహిళలు 13 మంది, సిరిసిల్లలోని మహేశ్వర సొసైటీలో 36 మంది ఉండగా, పురుషులు 32మంది, మహిళలు నలుగురు, జగదాంబ సొసైటీలో18 మంది ఉండగా, పురుషులు 11 మంది, మహిళలు 7 మంది, సిరిసిల్ల సొసైటీలో 37 మంది ఉండగా, పురుషులు 33 మంది, మహిళలు నలుగురు, శ్రీలక్ష్మీ పవర్‌లూమ్ సొసైటీలో 21 మంది ఉండగా, పురుషులు 17 మంది, మహిళలు నలుగురు, భాగ్యలక్ష్మీ పవర్‌లూమ్ సొసైటీలో 21 మంది ఉండగా, పురుషులు 13 మంది, మహిళలు 8 మంది, అశోక పవర్‌లూమ్ సొసైటీలో 21 మంది ఉండగా, పురుషులు 18 మంది, మహిళలు 5 మంది, సరస్వతి పవర్‌లూమ్ సొసైటీలో 22 మంది ఉండగా, పురుషులు 17 మంది, మహిళలు 5 మంది, భద్రావతి చేనేత సొసైటీలో 28 మంది ఉండగా, పురుషులు 26 మంది, మహిళలు ఇద్దరు ఉన్నారు.