ప్రగతి దిశగా అడుగులు
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:26 AM
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి రెండేళ్లు గడిచిపోయిన సంక్షేమ పథకాలు మినహా ప్రత్యేక అభివృద్ధి మార్క్ కనిపించడం లేదనే విమర్శలు జిల్లాలో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు పల్లెలు, పట్టణాల్లో చాలా నెలలు స్థానిక సంస్థలకు పాలకులు లేక అభివృద్ధిని పట్టించుకునే వారు లేకుండా పోయింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి రెండేళ్లు గడిచిపోయిన సంక్షేమ పథకాలు మినహా ప్రత్యేక అభివృద్ధి మార్క్ కనిపించడం లేదనే విమర్శలు జిల్లాలో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు పల్లెలు, పట్టణాల్లో చాలా నెలలు స్థానిక సంస్థలకు పాలకులు లేక అభివృద్ధిని పట్టించుకునే వారు లేకుండా పోయింది. డిసెంబర్‌లో గ్రామపంచాయతీ, ఫిబ్రవరిలో మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలతో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. కుంటుబడిన పాలనను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం 5 దశల్లో 99 రోజులపాటు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ప్రగతి వైపు పాలన అడుగులు పడుతాయని ప్రజలు భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు 260 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం, రోడ్లు, తాగునీరు తదితర సమస్యలను ఎదుర్కొంటున్న పల్లెలు ఉన్నాయి. వీటితో పాటు భూభారతి, ఇతర కార్యాలయాల్లో వివిధ సమస్యలపై దరఖాస్తు చేసుకొని కార్యాలయాలు చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. సంక్షేమ పథకాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలతో నిత్యం కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి పాలను ముందుకు నడిపించే దిశగా ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. జిల్లాలో కార్యక్రమాన్ని పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా విజయవంతంగా పూర్తి చేసే దిశగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులకు మార్గనిర్ధేశం చేశారు.
99 రోజులపాటు పాలనలో హడావుడి
జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలోని 67 వార్డులు, 260 గ్రామపంచాయతీలో శుక్రవారం నుంచి జూన్ 12వతేదీ వరకు ఐదు దశల్లో 99 రోజులపాటు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికతో హడావుడి కనిపించనుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం వైపు దృష్టి పెట్టనున్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో 10 అంశాలపై ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, పిల్ల భద్రత, డ్రగ్స్‌కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, మహిళలు, యువత, క్రీడలు, పర్యావరణ వంటి అంశాలపై దృష్టి పెట్టి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతారు. సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలు, గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ, పిచ్చిమొక్కల తొలగింపు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త నిర్మూలన, ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు చేపడుతారు. ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్య కార్యక్రమాలు, ఏప్రిల్ 13 నుంచి 18 వరకు సురక్షితంగా చేరుకోండి కార్యక్రమాన్ని హోం, రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఏప్రిల్ 20 నుంచి 25 వరకు సంక్షేమం అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు స్థితిగతులపై సమీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత, రక్షణ డ్రగ్స్ నివారణపై కళాశాలలు, పాఠశాలలో అవగాహన, మే 4 నుంచి 9 వరకు రైతులు, వ్యవసాయం, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ శాఖల సమన్వయంతో తగు సలహాలు, ఎరువులు, విత్తనాల లభ్యత, నిరంతరం విద్యుత్ సరఫరా అంశాలపై చర్యలు తీసుకుంటారు. మే 11 నుంచి 16 వరకు విద్య, పాఠశాల మౌలిక వసతులు, పరిశుభ్రత, భోజన నాణ్యత, మే 18 నుంచి 23 వరకు యువత, క్రీడలు, మే 25 నుంచి 30 వరకు మహిళా సాధికారత, స్వయంఉపాధి, స్వశక్తి సంఘాల బలోపేతం కోసం చర్యలు చేపడుతారు. జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణం, ప్లాస్టిక్ నియంత్రణ వంటి కార్యక్రమాలు చేపడుతారు. దీంతోపాటు 99 రోజులపాటు శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా నిర్ణయించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక అమలుపై సర్పంచులు, చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి బుక్‌లెట్ అందిస్తారు.
ఉద్యోగుల్లో భయం..
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నిర్లక్ష్య వహిస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అధికారులు ఉదాసీనత కనబరిస్తే చర్యలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. గతంలో పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాల్లో కిందిస్థాయి ఉద్యోగులు చిన్నచిన్న కారణాలకే సస్పెండ్‌కు గురైన సందర్భాలు ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళనతో ఉద్యోగులు ఉన్నారు.
ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కుదిరేనా..
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు అవుతారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారే సగం సగం గెలుపొందారు. జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ పగ్గాలు బీఆర్‌ఎస్, వేములవాడ పాలకపగ్గాలు కాంగ్రెస్ చేపట్టింది. అలాగే 260 గ్రామపంచాయతీలో సర్పంచ్ స్థానాల్లో బీఆర్‌ఎస్ 107, కాంగ్రెస్ 97, బీజేపీ 20, సీపీఎం మూడు, ఇతరులు 33 మంది గెలుపొందారు. ఇందులో తర్వాత సర్పంచ్‌ల్లో కొందరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కలిసి వస్తారా? లేదా అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలకతీతంగా అందరూ ఈ కార్యక్రమం నిర్వహణలో భాగస్వాములైతేనే కార్యక్రమం విజయవంతం అవుతుందని భావిస్తున్నారు.