సీనియర్ సిటిజన్ కేసుల పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:06 AM
జిల్లాలో సీనియర్ సిటిజన్‌ల నుంచి వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లాలోని వయోవృద్ధుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత రెవెన్యూ ట్రిబ్యూనల్ ద్వారా పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు.
పెద్దపల్లి కల్చరల్, మార్చి11(ఆంధ్రజ్యోతి):జిల్లాలో సీనియర్ సిటిజన్‌ల నుంచి వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లాలోని వయోవృద్ధుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత రెవెన్యూ ట్రిబ్యూనల్ ద్వారా పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయంలో 130 కేసులు నమోదు కాగా వాటిలో 121 పరిష్కరించామని, 9 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. అలాగే మంథని ఆర్డీఓ కార్యాలయంలో 28 కేసులకు 26 పరిష్కరించామని, రెండు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దీనితోపాటు అప్పీలేట్ కేసులు 19 నమోదు కాగా అన్ని పరిష్కరించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 166 కేసులకు పరిష్కారం చూపినట్లు ఆయన వివరించారు. సీనియర్ సిటిజన్ సంరక్షణ చట్టం ప్రకారం తల్లితండ్రుల పోషణ బాధ్యత పూర్తిగా వారి పిల్లలదేనని తెలిపారు. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పాటించని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వయోవృద్ధులు తమ పిల్లలు సరైన విధంగా చూసుకోవడం లేదనే ఫిర్యాదులను ముందుగా సంబంధిత ఆర్డీఓ వద్ద నమోదు చేయాలని, అక్కడ సమస్య పరిష్కారం కాని పక్షంలో జిల్లా కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు.