ఓపెన్ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:46 PM
మేడిపల్లి ఓపెన్ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం మేడిపల్లి ఓపెన్ కాస్టు ప్రాజెక్టును సందర్శించి, ఓబీ డంప్ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, చేపల చెరువులను పరిశీలించారు.
గోదావరిఖని, జూలై 2 (ఆంధ్రజ్యోతి): మేడిపల్లి ఓపెన్ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం మేడిపల్లి ఓపెన్ కాస్టు ప్రాజెక్టును సందర్శించి, ఓబీ డంప్ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, చేపల చెరువులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వృథాగా ఉన్న చేపల చెరువులను పునరుద్ధరించి చేపల పెంపకానికి వినియోగించాలని సూచించారు. దీనివల్ల స్థానిక నిరుద్యోగ మత్స్యకారులు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. చెరువుల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. ప్రభుత్వం చేపట్టిన మత్స్య అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా సింగరేణి ఓబీ డంప్ ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటి వనరులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చేపల చెరువులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలి చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. చేపల పెంపకం, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిలో లేదా అర్హత కలిగిన మత్స్యకార సహకార సంఘాలకు టెండర్ ప్రక్రియ ద్వారా అప్పగించే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో గతంలో నిర్మించిన చేపల చెరువులను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు తగిన ప్రతిపాదనలు కార్పొరేట్ కార్యాలయం అనుమతులకు పంపించామని తెలిపారు. మత్స్యశాఖ జిల్లా అధికారి పీ నరేష్ కుమార్ నాయుడు, ఏజెంట్ లక్కిడి రమేష్, డీజీఎం ఎస్టేట్ కుమారస్వామి, ఏరియా సర్వే ఆఫీసర్ లక్ష్మీరాజం, డీజీఎం (ఫారెస్ట్) కర్ణ, మేనేజర్ మల్లికార్జున్‌యాదవ్, అధికారులు పాల్గొన్నారు.