మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:24 AM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసలైతే భవిష్యత్ అయినా నాశనం అవుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. ప్రజా పాలన, పట్టణ ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రత, మత్తు పదార్థాల వినియోగం, అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై వన్‌టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీపీ మాట్లాడారు.
కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసలైతే భవిష్యత్ అయినా నాశనం అవుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. ప్రజా పాలన, పట్టణ ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రత, మత్తు పదార్థాల వినియోగం, అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై వన్‌టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీపీ మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని, యువతలో సహజంగా ఉన్న ఉత్సాహం, శక్తిని క్రీడలు, విద్య, సమాజ శ్రేయస్సుకు వినియోగించాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటైతే ఆరోగ్య దెబ్బతినడమే కాకుండా జీవితమే ప్రమాదంలో పడుతుందన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడితే స్నేహితులు వారిని మార్చే ప్రయత్నం చేయాలని, వారితో సాధ్యం కాకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవనికి పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. రోడ్డు ప్రమాదాలకు యువతే ఎక్కువ గురవుతున్నారని, క్షత గాత్రులు, మరణించిన వారిలో 60 నుంచి 70శాతం యువకులే ఉంటున్నారన్నారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సైబర్ నేరాల విషయంలో విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన్ ద్వారా ప్రపంచంతో అనుసంధానం సాధ్యమవుతున్నప్పటికీ అదే సమయంలో సైబర్ నేరస్థులకు కూడా అవకాశం దొరుకుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లను బాధ్యతయుతంగా వినియోగించాలని, అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరగాళ్ల బారిన పడమన్నారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ ఎం రమేష్, ప్రవచన కర్త ఎస్‌పీ నాయక్ బంజార, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, వన్‌టౌన్ ఎస్‌ఐలు రమేష్, అనూష, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.