Share News

శ్రీరస్తు... శుభమస్తు

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:43 AM

వివాహాలు, శుభకార్యాల సందడి మొదలైంది. ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో భాజాభజంత్రీలు మోగనున్నాయి.

శ్రీరస్తు... శుభమస్తు

జగిత్యాల, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): వివాహాలు, శుభకార్యాల సందడి మొదలైంది. ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో భాజాభజంత్రీలు మోగనున్నాయి. మాఘ మాసం నుంచి మార్చి 11వ తేదీ వరకు మూడు మంచి ముహూర్తాలున్నట్లు పురోహితులు అంటున్నారు. ఉగాది, శ్రీరామ నవమి తర్వాత మళ్లీ వివాహాలు మొదలు అవుతుండ డంతో కల్యాణ మండపాల వద్ద పెళ్లి బృందాల సందడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతా ల్లో మూడుముళ్లతో వందల సంఖ్యలో నవజంటలు ఒక్కటి కానున్నాయి. ఇందుకు అనుగుణంగా యువతీయువకుల తల్లిదండ్రులు ముందస్తు పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉంటున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలైన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో అధిక సంఖ్యలో వివాహ వేడుకలు జరగనున్నాయి.

వివాహ ముహూర్తాలు

వివాహానికి యోగ్యమైన ముహూర్తాలను పండితులు సూచిస్తున్నారు. ఫిబ్రవరి మాసంలో 22,25వ తేదీలలో, మార్చిలో 5వ తేదీ,6,7,8,11,12వ తేదీలు, ఏప్రిల్‌లో 1,2,3,4,8,10,11,12,29,30వ తేదీలలో మంచి ముహూర్తాలున్నాయని పురోహితులు తెలుపుతున్నారు. మే 1వ తేదీ, 3,6,8,9,10వ తేదీ, జూన్‌ 20వ తేదీ, 24,25వ తేదీ, జూలై 1వ తేదీ, 2,3,5,8వ తేదీ, ఆగస్టు 16వ తేదీ, 20,21,23,26,27,30వ తేదీ, సెప్టెంబరులో 4వ తేదీ, 6,7, నవంబరు మాసంలో 13వ తేదీ, 14,15,18,20,21,22,26వ తేదీలు, డిసెం బరులో 3వ తేదీ, 12,13,18,19,20,31వ తేదీలలో మంచి ముహూర్తాలున్నాయి.

ముందస్తు బుకింగ్‌లు

జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండడంతో తల్లిదండ్రులు ముందస్తు పనులపై దృష్టి సారించారు. పంక్షన్‌ హాళ్లు, క్యాటరింగ్‌, పురోహితులు, భాజాభజంత్రీలు, ఆర్కెస్ట్రా, డెకరేషన్‌, ఫొటోగ్రఫీ, ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్టుడియోలు ఇలా పెళ్లికి అవసరమైన వాటిని ముందస్తుగా బుక్‌ చేసుకోవడంపై దృష్టి సారించారు. అదే విధంగా వివాహాలకు అవసరమైన దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోళ్ల ముందస్తు కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో సుమారు 150 వరకు పంక్షన్‌ హాళ్లు, సుమారు 300 వరకు కమ్యూనిటీ హాళ్లు, పదుల సంఖ్యల్లో దేవాలయాల్లో పెళ్లి మండపాలు ఉన్నాయి. వీటిని ముందస్తుగా బుక్‌ చేసుకుంటున్నారు.

ఊపందుకోనున్న వ్యాపారాలు

పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వ్యాపారాలు జోరుగా సాగను న్నాయి. షాపింగ్‌ మాల్స్‌, బట్టల దుకాణాలు, డ్రెస్సెస్‌, జ్యూవెల్లరీ దుకాణాలు, లేడిస్‌ ఎంపోరియంలు, ఫొటో స్టుడియోలు, వీడియోగ్రఫీ సెంటర్లు, ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్టూడియోలు, పంక్షన్‌ హాల్స్‌, క్యాటరింగ్‌ కేంద్రాలు, ఫ్లవర్‌ డెకరేటర్స్‌, వంట మాస్టర్స్‌ ఇలా పలు వ్యాపారాలు పుంజుకోనున్నాయి. ఇప్పటికే ఇందుకు అవసరమైన ఏర్పాట్లను వ్యాపారాల నిర్వాహకులు చేసుకున్నారు. ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో బంగారం, వస్త్ర వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నూతన డిజైన్లతో కూడిన వస్త్రాలను వ్యాపారులు తీసుకవచ్చి తమ దుకాణాల్లో విక్రయానికి సిద్దంగా ఉంచారు. వినియోగదారులను ఆకర్శించడానికి డిస్కౌంట్‌లు, ఇతర బహుమ తులను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. వివాహాల సీజన్‌లో జిల్లా మొత్తంగా రోజుకు రూ. కోటి నుంచి రూ. మూడు కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా.

Updated Date - Feb 22 , 2026 | 12:43 AM