Share News

మంథనిని అల్లకల్లోలం చేస్తున్న శ్రీధర్‌బాబు

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:04 AM

ప్రశాంతంగా ఉన్న మంథనిని అల్లకల్లోలంగా మంత్రి శ్రీధర్‌బాబు మారుస్తున్నారని, శ్రీధర్‌బాబు అడుగులకు మడుగులొత్తే పోలీసులను వదిలిపెట్టమని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌ను మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేసి గోదావరిఖని ఏసీపీ కార్యాలయానికి తరలించారు.

మంథనిని అల్లకల్లోలం చేస్తున్న శ్రీధర్‌బాబు

కోల్‌సిటీ, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రశాంతంగా ఉన్న మంథనిని అల్లకల్లోలంగా మంత్రి శ్రీధర్‌బాబు మారుస్తున్నారని, శ్రీధర్‌బాబు అడుగులకు మడుగులొత్తే పోలీసులను వదిలిపెట్టమని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌ను మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేసి గోదావరిఖని ఏసీపీ కార్యాలయానికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పుట్ట శైలజ, మాజీ జెడ్‌పీ చైర్మన్‌ జక్కిని శ్రీహర్ష ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళుతుండగా బంగ్లాస్‌ ఏరియా వద్ద అడ్డగించారు. పూదరి సత్యనారాయణను తమకు చూపించాలంటూ ఆందోళనకు దిగారు. వన్‌టౌన్‌ సీఐ నాయకులకు నచ్చజెప్పి రాజీవ్‌ రహదారి వద్దకు తీసుకువచ్చారు. రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝాను కలువడానికి వెళుతుండగా అడ్డుకోగా పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పుట్ట మధు మాట్లాడుతూ ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌లో బండి రాజు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో అక్రమంగా పూదరి సత్యనారాయణను అరెస్టు చేశారని, సత్యనారాయణ అరెస్టు చెల్లదని జడ్జి తిరిగి వెనకకు పంపించారని, పోలీసుల అత్యుత్సాహం మంత్రి ప్రోత్సాహంతోనే మంథనిలో దుద్దిళ్ల రాజ్యాంగం, పోలీసుల రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. పోలీసులు ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. రామగుండం పోలీసులను ఇప్పటికే హెచ్చరించినా మార్పు రావడం లేదని, బీఆర్‌ఎస్‌ జైల్‌భరో కార్యక్రమానికి పిలుపునిస్తే మీ జైల్లు సరిపోతాయా అని ప్రశ్నించారు. ఐపీఎస్‌ అధికారి అంటే రాజ్యాంగాన్ని రక్షించే విధంగా పని చేయాలన్నారు. మంథని సీఐ రాజు, ఏసీపీ రమేష్‌ను వదిలిపెట్టేది లేదని, పదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్‌గా పని చేసిందని, కానీ ఇప్పుడు కుట్ర పూరితంగా పని చేస్తున్నారని ఆరోపించారు. కాటారం, భూపాలపల్లి, రామగుండం కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు మమ్మల్ని అనేక కేసులతో అణిచివేయడానికి కుట్రలు చేస్తున్నారని, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తామో తేల్చుకుంటామన్నారు. ఇప్పటికైనా పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, రాజ్యాంగాన్ని అనుసరించి పని చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఇబ్బందిపెడితే తగిన మూల్యం చెల్లించవల్సి ఉంటుందన్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో సీఐలు, ఎస్‌ఐలు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకుని పని చేస్తున్నట్లు అర్థమవుతుందన్నారు.

కేసును రిజెక్ట్‌ చేసిన న్యాయమూర్తి

ముత్తారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అడవి శ్రీరాంపూర్‌లో ఒక యువకుడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ యుకుడినిపై దాడి చేసిన వీడియోలను వైరల్‌ చేయడం వల్లే ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ముత్తారం పోలీసులు ఏ2గా నమోదు చేశారు. మంగళవారం ఉదయం సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసి గోదావరిఖని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈ కేసులో ఏ2 ప్రమేయం ఏమి లేదని నిర్ధారించి విడిచిపెట్టినట్టు సత్యనారాయణ తరపు న్యాయవాది ముచ్చకుర్తి కుమార్‌ తెలిపారు.

Updated Date - Jun 10 , 2026 | 12:04 AM