Share News

సోలార్‌ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:44 PM

రామగుండం ఎన్టీపీసీలో మరో కొత్త ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తికి సిద్ధం చేశామని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, పక్కన ఉన్న స్థలంలో 176 మెగావాట్ల సామర్థ్యం గల కంబైన్డ్‌(ఫ్లోటింగ్‌, సర్ఫేస్‌) సోలార్‌ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, గ్రిడ్‌ నుంచి క్లియరెన్సు వచ్చిన వెంటనే కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లేర్‌(సివొడి) ప్రకటించనున్నట్లు ఈడీ పేర్కొన్నారు.

 సోలార్‌ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం

జ్యోతినగర్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి) : రామగుండం ఎన్టీపీసీలో మరో కొత్త ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తికి సిద్ధం చేశామని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, పక్కన ఉన్న స్థలంలో 176 మెగావాట్ల సామర్థ్యం గల కంబైన్డ్‌(ఫ్లోటింగ్‌, సర్ఫేస్‌) సోలార్‌ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, గ్రిడ్‌ నుంచి క్లియరెన్సు వచ్చిన వెంటనే కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లేర్‌(సివొడి) ప్రకటించనున్నట్లు ఈడీ పేర్కొన్నారు. మంగళవారం ఈడీసీ మిలీనియం హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఈడీ మాట్లాడుతూ రిజర్వాయర్‌ నీటిలో 56 మెగావాట్లు ఫ్లోటింగ్‌ సోలార్‌, పక్కనే స్థలంలో 120 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును నెలకొల్పామన్నారు. ఇప్పటికే రిజర్వాయర్‌లో 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు పని చేస్తోందని, 56 మెగావాట్ల విస్తరణ యూనిట్‌ ప్రారంభమైతే 156 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో దక్షిణాదిలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుగా గుర్తింపు వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పవర్‌ పర్చేజ్‌ ఎగ్రిమెంట్‌ -పీపీఏ) కుదిరిన వెంటనే తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. 2400 మెగావాట్ల టీఎస్‌టీపీపీ ఫేజ్‌ 2 పీపీఏకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగతున్నాయని, ఒప్పందం విషయం కొలిక్కి వస్తే ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ముందడుగు పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 మెగావాట్లకు సంబంధించి మాత్రమే పీపీఏ చేసుకునేందుకు సానుకూలత వ్యక్తం చేసిందన్నారు. మిగతా 2400 మెగావాట్లను కేటాయించాలని ఇతర రాష్ట్రాలు కోరుతున్నాయని ఆయన తెలిపారు. రెండో దశ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతితోపాటు ఇతర క్లియరెన్సులు లభించాయని ఈడీ తెలిపారు.

డిమాండ్‌ లేకనే యూనిట్ల షట్‌డౌన్‌..

వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల రాష్ట్రంతోపాటు దక్షిణాదిలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడం వల్ల రామగుండం ఎన్టీపీసీ, టీఎస్‌టీపీపీ లోని 5 యూనిట్లను షట్‌డౌన్‌ చేయాల్సి వచ్చిందని ఈడీ స్పష్టం చేశారు. డిమాండ్‌ లేకపోవడం, గ్రిడ్‌ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్‌ చేయడంలో భాగంగా ప్రాజెక్టులోని యూనిట్లను మాసివేశామన్నారు. అయితే సోమవారం రాత్రి రెండు యూనిట్లను పునరుద్ధరించామన్నారు. విద్యుత్‌ డిమాండు మేరకు మిగతా యూనిట్లను ఉత్పత్తి దశలో పెడుతామని తెలిపారు. అలాగే వేసవిలో దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్‌ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, రామగుండం ప్రాజెక్టులోని 2, 4, 6 యూనిట్లకు వార్షిక మరమ్మతులు(ఓవర్‌హాల్‌) పూర్తి చేశామని తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న క్రమంలో వెలువడే సల్ఫర్‌ డైయాక్సైడ్‌ వాయువును నియంత్రించేందుకు రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో నెలకొల్పుతున్న ఫ్లూ గ్యాస్‌ డీ సల్ఫరైజేషన్‌(ఎఫ్‌జిడి)ని ఈ ఏడాదిలో వినియోగంలోకి తెస్తామన్నారు. ఎఫ్‌జిడి ద్వారా ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన 1.25 లక్షల టన్నుల జిప్సంను విక్రయించామని తెలిపారు.

ప్రాజెక్టుల్లో మెరుగైన ఉత్పత్తి

రామగుండం ఎన్టీపీసీ, టీఎస్‌టీపీపీ స్టేజ్‌ 1లో 2025-26లో మెరుగైన విద్యుత్‌ ఉత్పత్తి జరిగిందని తెలిపారు. రామగుండం ప్రాజెక్టులో ఈ ఏడాది 13.04 బిలియన్‌ యూనిట్లు, టీఎస్‌టీపీపీలో 9 బిలియన్‌ యూనిట్ల మేరకు విద్యుత్‌ ఉత్పత్తి సాధించిందన్నారు. ఈ వేసవి డిమాండ్‌ మేరకు ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను అందుబాటులో ఉంచామని, ప్రస్తుతం ప్రాజెక్టు కోల్‌యార్డులో 5లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు స్టాక్‌ ఉందన్నారు. త్వరలో 100 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని ఈడీ తెలిపారు. అలాగే కార్బొనేటెడ్‌ బ్రిక్స్‌ తయారీ యూనిట్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు.

సీఎస్‌ఆర్‌తో అభివృద్ధి పనులు..

ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి సీఎస్‌ఆర్‌ పథకం కింద పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలు కల్పించడం, గామ్రీణ క్రీడల ప్రోత్సాహానికి ఈ ఏడాది సుమారు 15 కోట్ల రూపాయలు వినియోగించామని తెలిపారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్‌కు సంబంధించిన నిధులను ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో జీఎంలు ముకుల్‌ రాయ్‌, మనీష్‌ అగర్వాల్‌, అహాజిత్‌ దత్తా, ఏజీఎం విజయ్‌ కుమార్‌ సిక్దర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 11:44 PM