భూసార పరీక్ష.. రైతులకు రక్ష..
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:33 AM
భూసార పరీక్షలు రైతులకు రక్షగా నిలుస్తాయని భావిస్తారు. ముందస్తుగా భూసార పరీక్షలతో భూమిలో ఎలాంటి పంటలకు అనువైనదో తేలిపోతుంది. దానికి అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసుకుంటే చీడపీడల నుంచి రక్షణ ఉండడమే కాకుండా దిగుబడి కూడా ఆశాజనకంగా వస్తుంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
భూసార పరీక్షలు రైతులకు రక్షగా నిలుస్తాయని భావిస్తారు. ముందస్తుగా భూసార పరీక్షలతో భూమిలో ఎలాంటి పంటలకు అనువైనదో తేలిపోతుంది. దానికి అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసుకుంటే చీడపీడల నుంచి రక్షణ ఉండడమే కాకుండా దిగుబడి కూడా ఆశాజనకంగా వస్తుంది. భూసార పరీక్షల వల్ల పంట నేలలకు మేలు కూడా కలుగుతుంది. భూసార పరీక్షలు మొక్కుబడిగానే సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈసారి వ్యవసాయశాఖ భూసార సంరక్షణ, భూసార పరీక్షల ఆవశ్యకతపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించి వారిలో చైతన్యం తెచ్చే దిశగా కార్యాచరణ రూపకల్పన చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి సంవత్సరం ఖరీఫ్‌లో 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వరి, పత్తి సాగు వైపు రైతులు మొగ్గు చూపుతారు. యాసంగిలో 1.89 లక్షల్లో సాగు చేసిన ప్రధాన పంటగా వరి మాత్రమే సాగు చేసి మిగతా పంటలు కొద్ది ఎకరాల్లోనే వేసుకుంటారు. ఈక్రమంలోనే వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. కొద్ది నెల క్రితం డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేకు వలంటీర్లను నియమించినట్లే భూసార పరీక్షల కోసం కూడా ‘భూసార ఆరోగ్య వలంటీర్ల’ను నియమించే కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని మండలాల్లో వలంటీర్ల నియామకం చేపట్టారు. పూర్తిస్థాయిలో వలంటీర్ల ఎంపిక పూర్తి చేసిన తర్వాత జిల్లాలోనే వ్యవసాయ కళాశాలలో వారికి శిక్షణ ఇవ్వనున్నారు. మరో పది రోజుల్లో పల్లెల్లో వలంటీర్ల సందడి కనిపించనుంది.
జిల్లాలో 525 మంది వలంటీర్లు..
భూసారాన్ని రక్షించి రైతులకు మేలు చేసే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 175 రెవెన్యూ గ్రామాల్లో భూసార ఆరోగ్య వలంటీర్లను నియమిస్తున్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున జిల్లాలో 525 మందిని వలంటీర్లుగా నియమిస్తారు. వలంటీర్లకు ఎలాంటి గౌరవ వేతనం, జీతభత్యాలు కానీ ప్రభుత్వం నుంచి ఏమి ఉండకపోవచ్చు. వ్యవసాయంపై ఆసక్తి ఉన్న వారిలో పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారిని ఎంపిక చేయాలని నిబంధన ఉంది. మరోవైపు ఎలాంటి గౌరవ వేతనం లేకపోవడంతో యువకులు వలంటీర్లుగా ముందుకు రావడంలేదని తెలుస్తోంది. వ్యవసాయ శాఖ ఏఈవోలు, ఏవోలు యువకులను భుజగిస్తూ నియమిస్తున్నారు. వలంటీర్లుగా వచ్చినవారు రైతులకు భూసార సంరక్షణ, పరీక్షలపైన సలహాలు, ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది, భూసార పరీక్షలతో లాభాల విషయాల గురించి వివరించాల్సి ఉంటుంది, గ్రామాల్లో రసాయనిక ఎరువులు అధికంగా వాడడం, సాంప్రదాయ ఎరువులకు దూరంగా ఉండడం జరుగుతుంది. దీనివల్ల భూసారం తగ్గి పంటలు దిగుబడుల్లో నష్టం రావడం, రైతులు సాగుచేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటల వ్యర్ధాలు తగలబెట్టడం వల్ల కలుగుతున్న నష్టపోయే తీరుపై అవగాహన కల్పిస్తారు. భూసార పరీక్షలతో భూముల్లో ఉన్న పోషకాలు, లోపాల గురించి అవగాహన కల్పించి వేయాల్సిన పంటలపై అవగాహన పెంపోందిస్తారు.
జిల్లాలో మండలాల వారీగా వలంటీర్లు ఇలా..
మండలం రెవెన్యూ గ్రామాలు వలంటీర్లు
గంభీరావుపేట 18 54
ఇల్లంతకుంట 21 63
ముస్తాబాద్ 16 48
సిరిసిల్ల 05 15
తంగళ్ళపల్లి 16 48
వీర్నపల్లి 08 24
ఎల్లారెడ్డిపేట్ 17 51
బోయినపల్లి 16 48
చందుర్తి 11 33
కోనరావుపేట 21 63
రుద్రంగి 03 09
వేములవాడ 08 24
వేములవాడ రూరల్ 15 45
మొత్తం 175 525