తప్పుల తడకగా స్మార్ట్ రేషన్ కార్డులు
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:03 AM
పాత రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో అన్ని గ్రామాలకు ఒకే పేరు ముద్రించారు. మండలంలో 15వేల రేషన్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. మొదటి విడతగా శనివారం 22 గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
ఓదెల, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): పాత రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో అన్ని గ్రామాలకు ఒకే పేరు ముద్రించారు. మండలంలో 15వేల రేషన్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. మొదటి విడతగా శనివారం 22 గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. హరిపురంలో 423 కార్డులను పంపిణీ చేస్తున్న క్రమంలో గ్రామం పేరు ఓదెలగా ముద్రించారు. అలాగే పోస్టల్ పిన్ కోడ్ నెంబర్లు కూడా తప్పుగా ముద్రించారు. దీంతో సర్పంచ్ గారవేణి విజయ, నాగరాజు, జీలకుంట గ్రామస్తులు గుర్తించి రేషన్ కార్డుల పంపిణీ నిలిపివేయించారు. అనంతరం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మండ లం, గ్రామం ఒకే పేరు రావడంతో సమస్యలు ఎదురవుతాయని సర్పంచ్ తెలిపారు. కార్డులు సరిదిద్దే వరకు పంపిణీ చేయమని సర్పంచ్ విజయ తెలిపారు. 15 వేల రేషన్ కార్డుల్లో అన్ని గ్రామాలకు ఒకే పేరు ఓదెల గా నమోదై ఉండటంతో అన్ని గ్రామాలలో కార్డుల పంపిణీ నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై తహసీల్దార్ వనజను వివరణ కోరగా స్మార్ట్ రేషన్ కార్డులన్ని ముంబైలో ముద్రించారని, సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం ఉండవచ్చని తెలిపారు. తప్పుడు ముద్రణ విషయంలో ఉన్నతాధి కారులకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రస్తుతం ఇక్కడి సాఫ్ట్‌వేర్‌లో ఎడిట్ ఆప్షన్ లేదని, ఉన్నతాధికారుల ఆదేశాలతో సరిదిద్దే అవకాశాలు ఉంటాయని తహసీల్దార్ వివరించారు.