స్వేచ్ఛా పోరులో సిరిసిల్ల..
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:57 AM
వందేళ్లకు పైగా సాగిన బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడిన 1947 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. కానీ నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో మాత్రం జాతీయ జెండా రెపరెపలాడని నిర్బంధ పరిస్థితుల్లో తెలంగాణలో స్వేచ్ఛా గీతం వినిపించేందుకు సాగిన పోరులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎందరో త్యాగధనులు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
వందేళ్లకు పైగా సాగిన బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడిన 1947 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. కానీ నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో మాత్రం జాతీయ జెండా రెపరెపలాడని నిర్బంధ పరిస్థితుల్లో తెలంగాణలో స్వేచ్ఛా గీతం వినిపించేందుకు సాగిన పోరులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎందరో త్యాగధనులు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారు. కొందరు తుపాకులు పట్టారు.. మరికొందరు బాపూజీ మహాత్మా గాంధీ పంథాను అనుసరించారు. మరెందరు తమ గళాలను, కలాలను ఝళిపించారు. నిజాం పాలన నుంచి విముక్తి సాధించే లక్ష్యంగా ముందుకు నడిచారు. పరాయి పాలనలో మగ్గుతున్న దేశానికి విముక్తి కల్పించాలనే సంకల్పం, నిజాం నిరంకుశ రాచరిక రాక్షసత్వానికి వ్యతిరేకంగా రెండు పోరాటాల్లో సిరిసిల్ల ముందు వరసలో నిలిచింది. ఆనాడు మిగిలిన జ్ఞాపకాలను స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అనాటి వీరుల త్యాగలు... మన జాతీయ జెండా రెపరెపలాడిన క్షణాన ఎగిసిన మదుర క్షణాలు... నేటికి జిల్లా ప్రజల మదిలో కదలాడుతుంటాయి. ఆగస్టు 15, 1947.. ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పొందిన రోజు.. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎగురవేయనున్నారు. ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు, సాంస్కృతిక కార్యకమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
స్వాతంత్య్ర పోరులో నేతన్నలు...
సిరిసిల్ల నేత కార్మికులు ప్రజల దైనందిన సమస్యలతో పాటు చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం చేనేత కార్మిక సంఘం ఏర్పడింది. కార్మిక సంఘం తెలంగాణ తృతీయ మహాసభను సిరిసిల్లలో జరుపుకున్నారు. 1946లో సభ నిర్వహించగా బొంబాయి, షోలాపూర్, అహ్మదాబాద్ ప్రాంతాలనుంచి చేనేత కార్మిక ప్రతినిధులు సిరిసిల్లకు తరలివచ్చారు. సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభ చేనేత వస్త్ర రంగంలో కార్మికుల్లో చైతన్యం నింపింది. సిరిసిల్లలో నిర్వహించిన ఆంధ్ర మహాసభ, మహిళ సభలు ఉద్యమం వైపు నడిపించాయి. ఆ క్రమంలో నాలుగో ఆంధ్ర మహాసభ 1935లో సిరిసిల్లలో భీమకవి నగరంగా మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో తెలంగాణ యోధులు బద్దంయెల్లారెడ్డి, రామకృష్ణరావు, కెవి రంగారెడ్డి, జెవి నర్సింగారావు, సురవరం ప్రతాపరెడ్డి, రావినారాయణరెడ్డివంటి నాయకులు పాల్గొన్నారు. మహాసభ నిర్వహణలో సిరిసిల్ల తాలూకలోని గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి ముఖ్య భూమికను పోషించాడు. వేములవాడ భీమకవి నగరంగా నిర్వహించిన మహాసభకు వివిధ ప్రాంతాలనుంచి ఎంతో మంది పాల్గొన్నారు. సభలో నిర్భంద ప్రాథమిక విద్య జాగీర్‌లోని ప్రజల హక్కులు, రైతాంత సమస్యలు, స్వపరిపాలన, నిమ్నజాతుల ఉద్ధరణ వాటిపై తీర్మానాలు చేశారు. ఇదే ప్రాంగణంలో 4వ ఆంధ్రా మహిళ సభ కూడా నిర్వహించారు. దీనికి మాడపాటి హన్మంతరావు సతీమణి మాణిక్యమ్మ అధ్యక్షత వహించారు. ఎల్లప్రగడ సీతాకుమారి లాంటి వారెందరో పాల్గొన్నారు. ఈ మహాసభల స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు కొత్త మలుపు తిరిగాయి. శిస్తు మాఫీ చేయాలని, నిర్బంధ లెవీ ధాన్యం వసూలు చేయవద్దని, బరాయింద ఉద్యమం నడిచింది.
క్విట్ ఇండియా ఉద్యమంలో మనవాళ్లు...
స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న దేశ ప్రజలు ఆలపించడానికి వందేమాతరం జాతీయ గీతంగా ఉండగా 1938లో నిజాం ప్రభుత్వం నిషేధించింది. దీనికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ విద్యార్థులు ముందుకు సాగారు. ఇందులో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. సిరిసిల్ల పాత తాలుకాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు, 1939లో 7వ తరగతిలో వందేమాతరం ఉద్యమం ప్రభావితం చేసింది. ఆంధ్రా మహాసభ కార్యకలాపాలకు గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి, రుద్రంగికి చెందిన సీహెచ్ నరసింహారావు కూడా రావడం చూసి రష్యన్ రెడ్ అర్మీ తెగించి పోరాడిన ఘట్టాలు చదివిన రాజేశ్వర్‌రావు వారివైపు అడుగులు వేశారు. 1942లో ఊపందుకున్న క్విట్ ఇండియా ఉద్యమంలో సీహెచ్ రాజేశ్వర్‌రావుతో పాటు సీహెచ్ హన్మంతరావు, సి నారాయణరెడ్డి, ముకుందరావు మిశ్రాలు పాల్గొన్నారు. కోనరావుపేటకు చెందిన సీహెచ్ రాజలింగం బాల్యంలోనే రజాకార్ల క్యాంపుపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు.
గ్రంథాలయోద్యమం...
నిజాం నిరంకుశ పాలన కింద బతుకులీడుస్తున్న ప్రజలను పోరాట బాటలో నడిపించడానికి గ్రంథాలయోద్యమం కూడా ముఖ్యమైంది. అక్షర జ్ఞానం నేర్పి పత్రికా పఠనం ద్వారా ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. 1886లో మందిన ఆదినారాయణ అనే ఉపాధ్యాయుడు విశాఖపట్నంలో మొదట గ్రంథాలయాన్ని స్థాపించాడు. కరీంనగర్ జిల్లాలో ప్రథమంగా 1922లో బస్వేశ్వర్‌రావు, వెంకట్రామారావులు, శ్రీవిశేశ్వర భాషా నిలయం పేరిట గ్రంథాలయ ఉద్యమానికి నాంది పలికారు. 1925లో సిరిసిల్లలో శ్రీ నారాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. ఖాదీ ఉద్యమంలో మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగినా చెరఖా సంఘం కార్యక్రమాల్లోనూ నేత కార్మికులు భాగస్వాములు అయ్యారు.
మదినిండా ఉండాలి..
జాతీయ పతాకాన్ని చూస్తే ఎవరి హృదయాల్లోనైనా జాతీయ భావం పొంగుకొస్తుంది. దేశంలో జాతీయ పతాకాన్ని కలకత్తాలోని గ్రీన్ పార్క్‌లో 1906 ఆగస్టు 7వ తేదిన ఎగుర వేశారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల అడ్డచారలు అప్పుడు పొందుపర్చారు. 1921లో కాంగ్రెస్ గాంధీజీ నాయకత్వంలోకి వచ్చింది. అప్పుడే విజయవాడలో సంఘం సమావేశం జరిగింది. పింగలి వెంకయ్య ఆ సభలో పాల్గొనడమే కాకుండా పతాకాలపై పరిశోధన చేసి 1916లోనే భారత దేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకం రాశారు. లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో వెంకయ్య తయారుచేసిన జాతీయ పతాకం, హోంరూల్ పతాక సంఘం ఎగురవేసింది. 1921లో జరిగిన సభలో వెంకయ్య తయారుచేసిన పతాకాన్ని గాంధీజీకి చూపించారు. దేశంలో ఉన్న రెండు వర్గాలకు ఎరుపు, ఆకుపచ్చ చారలు గుర్తులు ఉంచి ఇతర వర్గాలకు తెల్లని చార కలిపి మూడు రంగులతో పతాకం రూపొందించారు. గాంధీజీకి నచ్చి తెల్ల చార మీద చెరఖ చేర్చమన్నారు. ఈ విధంగా మూడు రంగుల జెండా తెలుగు వారిదిగానే రూపొందింది. 1931లో అఖిల భారత కాంగ్రెస్ సంఘం ఈ పతాకాన్ని ఆమోదించింది. అప్పటి నుంచిమూడు రంగుల జెండాలే ఎగురవేశారు. ఇందులోని ఎరుపు రంగు ధైర్యానికి, త్యాగానికి, తెలుపు శాంతి, సత్యాలకు, ఆకుపచ్చ విశ్వాసం, ఔదార్యానికి గుర్తుగా చెప్పుకున్నారు. జాతీయ పతాకంతో పింగలి వెంకయ్య దేశ ప్రజలందరికి చిరకాలంగా గుర్తుండిపోయారు. కాంగ్రెస్ జాతీయ సంస్థ మూడు రంగుల పతాకంలో రాట్నానికి బదులు చక్రం ఏర్పరిచారు. అశోకుని ధర్మ పాలన ప్రపంచమంతటా గుర్తింపు పొందడంతో ధర్మ చక్రం మన జెండాలో ఉండడం సమంజసంగా భావించారు. చక్రం చలనానికి చిహ్నంగా ముందుకు పోవాలని భావిస్తారు. ఈ ధర్మచక్రంలో 24ఆకులు ఉండాలని నిర్ణయించారు. జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. జాతీయ పతాకాన్ని ఎగుర వేసే సమయంలో పాటించాల్సిన నియమాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. జాతీయ పతాకం వందనానికి ఎవరైనా జెండాకు ఎదురుగా నిలబడి వందనం చేయాలి. ఇతర జెండాలతో కలిపి ప్రదర్శించాల్సి వస్తే జాతీయ జెండాను అన్నింటికంటే కుడి భాగాన ఉంచాలి. జెండా ఎక్కడ ఎగురవేసినా స్పష్టంగా కనిపించాలి. అందరు గౌరవ భావంతో చూడాలి. జాతీయ పతాకంపై ఎలాంటి రాతలు, రాయవద్దు, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని అగౌరవపరిస్తే ఏడాదినుంచి మూడేళ్ల వరకు శిక్ష పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం ఫ్లాగ్ కోడ్ 2022ను సవరించింది. గతంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతులు ఉండేవి. ఇప్పుడు ఏలాంటి సమయం, పరిమితి లేదు. జెండాను మూడు రోజుల పాటు పగలు, రాత్రి అలాగే ఉంచేయవచ్చని, పాలిస్టర్ వస్త్రం, యంత్రం ద్వారా తయారైన జెండాను ఎగురవేయవద్దన్న నిబంధనను తొలగించింది. కాటన్, చేనేత మగ్గాలు, సిల్క్, ఖాదీ, ఉన్ని, పాలిస్టర్, యంత్రం ద్వారా తయారైన త్రివర్ణ పతాకాలను ఎగురవేయవచ్చని పేర్కొంది. జాతీయ పతాకంతో పాటు జాతీయ గీతం కూడా ప్రధానమైంది. జాతీయ పతాకాన్ని ఎగుర వేసిన వెంటనే జాతీయ గీతం పాడాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతంలో మొత్తం 31 చరణాలు ఉన్నాయి. అందులో ఏడు చరణాలు మాత్రమే మన జాతీయ గీతంగా ఎన్నుకున్నాం. జాతీయ గీతం పాఠశాలలో ప్రతిరోజు ఆలపించాలి. విద్యార్థులకు గీతం కంఠతా రావాలి. దీన్ని అందరు కలిసి పాడాలి.