Share News

‘సర్‌’ కష్టాలు..

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:20 AM

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఎన్యూమరేషన్‌ ఫారాల భర్తీ ఓటర్లకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలను తప్పని సరిగా నమోదు చేయాల్సి రావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

‘సర్‌’ కష్టాలు..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఎన్యూమరేషన్‌ ఫారాల భర్తీ ఓటర్లకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలను తప్పని సరిగా నమోదు చేయాల్సి రావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 24 ఏళ్ల క్రితం తమ ఓటరు సంఖ్య, ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌, సీరియల్‌ నంబర్‌, పోలింగ్‌ స్టేషన్‌ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. దీంతో సర్‌ సర్వే నత్తనడకన సాగుతున్నది. జిల్లాలో గల ఓటర్లలో ఇప్పటి వరకు 36.86 శాతం మంది ఓటర్లకు ఫారాలను పంపిణీ చేయగా, 4.04 శాతం ఫారాలను మాత్రమే డిజిటలైజేషన్‌ చేశారు. అంటే ఓటర్లు ఫారాలు నింపేందుకు ఎన్ని కష్టాలు పడుతున్నారో దీనిని బట్టే అర్థం అవుతున్నది. రాష్ట్రంలో దొంగ ఓట్లు, మరణించిన ఓటర్లను తొలగించడంతో పాటు కొత్తగా ఓటు హక్కు కల్పించేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వీటి పరిధిలో 7,12,157 మంది ఓటర్లు ఉన్నారు. 845 పోలింగ్‌ బూతులు ఉన్నాయి. ఖచ్చితమైన ఓటర్లను నిర్ధారించేందుకుగాను ఎన్నికల కమిషన్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో చివరగా జరిగిన ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని మ్యాపింగ్‌ చేపట్టారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 2,59,402 మంది ఓటర్లకుగాను 2,10,380 మంది, రామగుండం నియోజక వర్గంలో 2,13,990 మంది ఓటర్లకుగాను 1,70,043 మంది, మంథని నియోజకవర్గంలో 2,38,765 మంది ఓటర్లకు గాను 1,95,843 మంది ఓటర్లు, మొత్తం జిల్లాలో 5,76,266 మంది 80.92 శాతం మంది ఓటర్లను మాత్రమే ఎన్నికల సిబ్బంది ఇంటింటికి తిరిగి మ్యాపింగ్‌ చేశారు. ఇంకా 1,35,891 మంది ఓటర్లు మ్యాపింగ్‌కు దొరకక పోవడం గమనార్హం. వీటి ఆధారంగా ఈ నెల 25వ తేదీ నుంచి బీఎల్‌ఓలు ఇంటింటికి తిరుగుతూ ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేస్తున్నారు. సోమవారం నాటికి బీఎల్‌వోలు 2,62,527 మంది 36.86 శాతం ఫారాలను అందజేశారు. ఆ ఫారాలను నింపేందుకు సరైన అవగాహన లేక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు బీఎల్‌వోలకు 10 శాతానికి మించి ఓటర్ల నుంచి ఫారాలు అందకపోవడం గమనార్హం. అందిన వాటిలో 10,618 ఫారాలను 4.04 శాతం డిజిటలైజేషన్‌ చేశారు. దీంతో వచ్చే నెల 24వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావడం కష్టమేనని తెలుస్తున్నది.

2002 ఓటరు జాబితా కోసం వెతుకులాట..

ఎస్‌ఐఆర్‌లో మొదటి కాలమ్‌లోనే 2002 నాటి ఓటరు వివరాలు నమోదు చేయాలని ఎన్నికల సంఘం సూచించడంతో సమస్య మరింత జఠిలమైంది. ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ, 2002లో తమ పేరు ఉందా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సాధారణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బీఎల్‌వోల వద్ద ఒక పీడీఎఫ్‌ రూపంలో మాత్రమే పాత జాబితా ఉండటంతో మొబైల్‌లో చూసి వివరాలు చెబుతున్నారు. అయితే స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం తెలియని వారు, నిరక్షరాస్యులు, వృద్ధులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కూడా ఓటర్ల సమస్యలను పెంచుతోంది. అప్పట్లో ఒక నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ప్రస్తుతం వేరే నియోజకవర్గాల్లో ఉండటంతో 2002 వివరాలను గుర్తిం చడం కష్టమవుతోంది. దీంతో ఫారాల భర్తీ ఆలస్యమవుతోంది. ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిలో వివరాలను సక్రమంగా భర్తీ చేయకపోతే ఓటు హక్కు ఉంటుందా, పోతుందా అని ఆందోళన చెందుతున్నారు.

సర్‌పై అవగాహన లేక బీఎల్‌వోలకూ తిప్పలు..

ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో బీఎల్‌వోలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 2002 జాబితాలో పేరు లేకపోతే మా ఓటు పోతుందా, ఇప్పుడు ఓటు ఉంటే సరిపోదా? వంటి ప్రశ్నలను ఓటర్లు అడుగుతుండడంతో వారికి సమాధానాలు చెప్పడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. చదువుకున్న వారు సైతం ఫారాలు పూర్తి చేయడానికి పలుమార్లు ఇతరుల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్యూమరేషన్‌ ఫారాలు పూర్తి చేయించేందుకు ఒక్కో ఇంటి వద్ద గంటకు పైగా సమయం పడుతోంది. దీంతో మిగిలిన ఇళ్లకు ఫారాలు పంపిణీ చేయడం బీఎల్‌వోలకు భారంగా మారింది. ఒక్కో బీఎల్‌వో 1200 మంది ఓటర్లకు ఫారాలు అందజేసి, తిరిగి కలెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం లభిస్తున్నప్పటికీ పట్టణాల్లో మాత్రం బీఎల్‌వోలు ఒంటరిగానే పని చేస్తున్నారు.

సర్వర్‌ సమస్యలతో ఇబ్బందులు..

ఎన్యూమరేషన్‌ ఫారాలపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను యాప్‌లో స్కాన్‌ చేసే సమయంలో సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలు కూడా తోడవడంతో ప్రక్రియ మరింత జాప్యమవుతున్నది. దీంతో నిర్ణీత గడువులో ప్రక్రియ పూర్తవుతుందా, లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌ఐఆర్‌ సకాలంలో పూర్తి కావాలంటే 2002 ఓటరు జాబితాను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచడంతో పాటు, గ్రామాలు, వార్డుల వారీగా ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఫారాల భర్తీపై విస్తృత అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:20 AM