రేపు సింగరేణి కార్మిక గర్జన
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:11 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిం చిందని, తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
గోదావరిఖని, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిం చిందని, తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఎండ గట్టేందుకు ఈనెల 14న గోదావరిఖని సింగరేణి స్టేడియం వేదికగా ’సింగరేణి కార్మిక గర్జన‘ పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా సోమవారం స్టేడియంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, పార్టీ ముఖ్య నేతలు కొబ్బరికాయ కొట్టి సభా ఏర్పాట్లను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తే, నేడు వేల కోట్ల రూపాయల అవినీతితో సంస్థను కుదేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ సింగరేణి గడ్డపై సింహగర్జన చేసి కార్మికులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. రావాల్సిన బకాయిలు రాక, ఉత్పత్తి పడిపోయి, వైద్యం, సొంత ఇంటి పథకం వంటి సౌకర్యాలు అందక సింగరేణి సంస్థ నిర్వీర్యం అవుతోందని టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను, సంస్థను కాపాడుకోవడం కోసం ఈ నెల 14న సాయంత్రం 5గంటలకు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.