Share News

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలి

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:29 AM

కార్మికులకు సొంతింటి కల సహకారంపై అసెంబ్లీలో ప్రస్తావించాలని, రామగుండం ఎమ్మెల్యే సింగరేణి కార్మికుల సొంతింటిపై మాట్లాడడం అభినందనీయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు.

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలి

గోదావరిఖని, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): కార్మికులకు సొంతింటి కల సహకారంపై అసెంబ్లీలో ప్రస్తావించాలని, రామగుండం ఎమ్మెల్యే సింగరేణి కార్మికుల సొంతింటిపై మాట్లాడడం అభినందనీయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలో 3140మంది ప్రైవేట్‌ వ్యక్తులకు సింగరేణి క్వార్టర్లపై పట్టాలు ఇచ్చారని, రామగుండంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల కలగానే మిగిలిపోతుందని, యూనియన్ల నిర్లక్ష్యం వల్లనే ఈ పథకానికి తూట్లు పడుతున్నాయన్నారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ సింగరేణి కార్మికుల ఇండ్ల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నారని, ఇక్కడ స్థలాలపై ఆయనతో చర్చించామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. కోల్‌బెల్ట్‌ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పటికీ కార్మిక సంఘాల నాయకులే ఈ పథకాన్ని అమలు చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల స్థానంలో కార్మికులకు సొంతంగా ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి 3వేల మందికి పట్టాలు ఇప్పించారని, ఇక్కడ ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో ప్రవీణ్‌ కుమార్‌, శివరాంరెడ్డి, శ్రీనివాస్‌, శ్రీహరి, కుమార్‌, నరహరిరావు, దినేష్‌, వెంకటేష్‌, మహ్మద్‌ పాషా పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 12:29 AM