Share News

కొత్త ప్రణాళికలతో సింగరేణి

ABN , Publish Date - May 10 , 2026 | 11:50 PM

సింగరేణి యాజ మాన్యం బొగ్గు ఉత్పత్తిపై కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యేటేటా ఉత్పత్తి పెంచుతూ పోతున్న సింగరేణి ఈయేడు 74 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 60మిలియన్లకు కుదించింది. గతంలో 44అండర్‌ గ్రౌండ్‌ బొగ్గు గనులు ఉండగా క్రమంగా మూసివేతకు గురవుతూ 21కి చేరుకున్నాయి. మూతపడిన బొగ్గు గనుల్లో మిగిలిన బొగ్గు నిల్వలను వెలికి తీసేందుకు మెగా ఓసీలను యాజమాన్యం రూపొందించుకు న్నది.

కొత్త ప్రణాళికలతో సింగరేణి

గోదావరిఖని, మే 10 (ఆంధ్రజ్యోతి): సింగరేణి యాజ మాన్యం బొగ్గు ఉత్పత్తిపై కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యేటేటా ఉత్పత్తి పెంచుతూ పోతున్న సింగరేణి ఈయేడు 74 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 60మిలియన్లకు కుదించింది. గతంలో 44అండర్‌ గ్రౌండ్‌ బొగ్గు గనులు ఉండగా క్రమంగా మూసివేతకు గురవుతూ 21కి చేరుకున్నాయి. మూతపడిన బొగ్గు గనుల్లో మిగిలిన బొగ్గు నిల్వలను వెలికి తీసేందుకు మెగా ఓసీలను యాజమాన్యం రూపొందించుకు న్నది. ఇందులో భాగంగా రామగుండం కోల్‌మైన్‌ పేరు మీద మూడు అండర్‌ గ్రౌండ్‌లను, రెండు ఓసీపీల ఎక్స్‌టెన్షన్లను కలిపి రామగుండం కోల్‌మైన్‌గా తయారుచేసి అనుమతులు తెచ్చుకున్నది. రామగుండం కోల్‌మైన్‌ పరిసర ప్రాంతాల్లో మిగిలి ఉన్న 314.98 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు నిర్ణయం తీసుకున్నది. అలాగే కొత్తగూడెంలోని గౌతమిఖని ఓపెన్‌ కాస్టు, మణుగూరు ఓసీపీ, మరికొన్నింటి తోపాటు కొత్తగూడెంలోని వీకే కోల్‌మైన్‌ కలిపి ఉత్పత్తి తీసేందుకు యత్నిస్తోంది. జీడీకే ఓసీపీ-3, ఓసీపీ-5 రెండు ఓపెన్‌కాస్టులను విలీనం చేస్తూ జీడీకే కోల్‌మైన్‌గా రామగుం డంలోనే మరో కొత్త మెగా ఓసీపీకి సింగరేణి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఓసీ-3, ఓసీ-5 పరిధులే కాకుండా పరిసర ప్రాంతాల్లోని అండర్‌ గ్రౌండ్‌ గనులను జీడీకే కోల్‌మైన్‌లోకి తీసుకురానున్నది. దీంతో రామగుండం ఏరియాలో నాలుగు ఓపెన్‌కాస్టులకు బదులు రెండు మెగా కోల్‌మైన్స్‌గా మారనున్నాయి.

ఇదిలా ఉండగా సింగరేణిలో తొమ్మిది కొత్త గనులను రెండుమూడేళ్లలో ప్రారంభించేందుకు సింగరేణి సన్నాహాలు చేస్తున్నది. ఈ తొమ్మిది ప్రాజె క్టులు చేపట్టడానికి కేంద్ర బొగ్గు, అటవీ, పర్యావరణశాఖల అనుమతికి ప్రతిపాదనలు పంపింది. అనుమతులు రాగానే నైనీబ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనున్నది. 2027-28 నాటికి సింగరేణిలో నాలుగు గనులు మూత పడుతుండగా ఏడాదికి 12.51మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనున్నది. దీన్ని భర్తీ చేసేందుకు తొమ్మిది కొత్త ప్రాజెక్టుల ద్వారా 20ఏళ్ల పాటు ఉత్పత్తి తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ గనుల్లో కొత్తగూడెంలోని వీకే కోల్‌ ప్రధానమైంది. ఈ ప్రాజెక్టు నుంచి 190 మిలి యన్‌ టన్నుల బొగ్గును బయటకు తీస్తారు. ఇల్లందు ప్రాంతంలోని జేకే ఓసీపీ నుంచి 19.68మిలియన్‌ టన్నులు, రామగుండం ఓసీ-1 విస్తరణ ప్రాజెక్టు ద్వారా 181.6 మిలియన్‌ టన్నుల బొగ్గును తీస్తారు. బెల్లంపల్లి డివిజన్‌లోని గోలేటి ఓసీ నుంచి 38.98మిలియన్‌ టన్నులు, ఎంవీకే ఓపెన్‌ కాస్టు ద్వారా 30.34 మిలియన్‌ టన్నులు, మణుగూరు ఓసీ ఎక్స్‌టన్షన్‌ ద్వారా 40.45మిలియన్‌ టన్నులు, మందమర్రి ఏరియాలోని ఆర్‌కేపీ ఓసీపీ ఫేస్‌-2 ద్వారా 34.42మిలియన్‌ టన్నులు, మణుగూరు ప్రాంతంలోని పీకే కోల్‌మైన్‌ కొండాపూర్‌ ద్వారా 62మిలియన్‌ టన్నుల బొగ్గును తీసేందుకు సింగరేణి కొత్త ప్రణాళికలు తయారు చేసింది. మొత్తం 600మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలను కొత్త ప్రాజెక్టుల ద్వారా 20ఏళ్లలో బయటకు తీసేందుకు యాజమాన్యం ప్రణాళికలు చేసింది.

సింగరేణిలో 17 ఓసీపీలు ఉండగా రెండేళ్లలో మరో మూడు ఉత్పత్తిలోకి వచ్చి మొత్తం 20ఓపెన్‌కాస్టుల నుంచి ఉత్పత్తి జరుగనున్నది. 21 అండర్‌ గ్రౌండ్‌ గనులు ఉండగా 2026లో మూడు, 2027లో రెండు బొగ్గు గనులు మూతపడనున్నాయి. ఇందులో ఆర్‌కే-5, ఎస్‌ఆర్‌పీ, జీడీకే5 ఓసీలున్నాయి. ఈ సంవత్సరం రామగుండం కోల్‌మైన్‌, జేకే ఓసీ, గోలేటి ఓసీ ఉత్పత్తికి లోకి రానున్నాయి. దీంతోపాటు ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల పేర్లు ఇకపై ఓపెన్‌కాస్టు కోల్‌మైన్స్‌గా మారనున్నాయి. ఇదిలాఉండగా ఓపెన్‌కాస్టులు, విస్తరణ ప్రాజెక్టులు విలీనాలు కావడం, అండర్‌ గ్రౌండ్‌ గనులు తగ్గిపోవడం నేపథ్యంలో సింగరేణిలోని 11డివిజన్లు 8డివిజన్లకు కుదించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం రామగుండంలో ఆర్‌జీ-1, ఆర్‌జీ-2, ఆర్‌జీ-3గా మూడు జీఎం కార్యాలయాలున్నాయి. రామగుండం కోల్‌మైన్‌ మెగా ప్రాజెక్టు, జీడీకే కోల్‌మైన్‌ మెగా ప్రాజెక్టు ప్రారంభమైతే రామగుం డం ఏరియాలో ఒక జీఎం కార్యాలయం తగ్గే అవకాశాలున్నాయి. బెల్లంపల్లి డివిజన్‌లో ఒక కైరిగూడ ఓసీపీ ఒక్కటే డివిజన్‌ పరిధిలో ఉంది. ఇల్లందులో కోయగూడెం ఓసీ మాత్రమే ఉన్నది. బెల్లంపల్లి, ఇల్లందు డివిజన్లలో కొత్త ప్రాజెక్టులు వస్తే ఆ రెండు డివిజన్లను సింగరేణి యాజమాన్యం ఎత్తివేసి అందుబాటులో ఉన్న జీఎం కార్యాలయాల్లో కలిపే అవకాశం ఉన్నది. మూడు జీఎం కార్యాలయాలను, డివిజన్లను తగ్గించడం వల్ల అధికారులను వినియోగించుకునేందుకు అవకాశంతో పాటు నిర్వహణ పరమైన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. సింగరేణిలో అదనంగా ఉన్న కార్మికులను, ఉద్యోగులను ఎక్కడి వారిని అక్కడే వాడుకునేందుకు ఈ రకమైన మార్పులకు పూను కున్నట్టు తెలుస్తున్నది. భూ సేకరణలు లేకుండా ప్రాజెక్టుల రూపకల్పన చేయడం వల్ల భవిష్యత్‌ 20ఏళ్లపాటు సింగరేణితో ఇంధన ఒప్పందం కలిగిన సంస్థలకు భరోసా కలిగించవచ్చని సింగరేణి భావిస్తోంది.

Updated Date - May 10 , 2026 | 11:50 PM