సింగరేణి లాభాలను వెంటనే ప్రకటించాలి
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:02 AM
సింగరేణి వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. లాభాల వివరాలను వెల్లడించకుంటే ప్రజా భవన్‌ను ముట్టడిస్తామన్నారు.
గోదావరిఖని, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): సింగరేణి వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. లాభాల వివరాలను వెల్లడించకుంటే ప్రజా భవన్‌ను ముట్టడిస్తామన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు గడిచిందని, ఇప్పటివరకు గత సంవత్సరం లెక్కలు చెప్పకపోవడం సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం దివాలా కోరు విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. దసరా పండుగలోపు లాభాల వాటాను చెల్లించడం సాంప్రదాయంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. మరో పక్షం రోజులలో దసరా పండుగ ఉన్నందున తక్షణమే లాభాలను ప్రకటించి, 36శాతం లాభాల వాటాను కార్మికులకు పంచాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే మంత్రులు చొరవ చూపి ముఖ్యమంత్రితో సంప్రదించాలని, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా చెప్పుకునే నాయకులు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. అనంతరం ఆర్‌జీ-1 జీఎంకు వినతి పత్రం అందజేశారు. నూనె కొమరయ్య, చెల్పూరి సతీష్, పోలాడి శ్రీనివాసరావు, ఇందూరు సత్యనారాయణ, మొదుంపల్లి రాజేశం, చిలకలపల్లి శ్రీనివాస్, కోండ్ర అంజయ్య, దూత శేషగిరి, జనగామ మల్లేష్, వాసర్ల జోసెఫ్, పాల్గొన్నారు.