Share News

సమస్యల పరిష్కారానికి సింగరేణి అధికారుల ర్యాలీ

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:54 PM

సింగరేణి యాజమాన్యంపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం గోదావరిఖనిలో నిరసన ప్రదర్శనకు దిగారు. ర్యాలీలో రామగుండం-1, 2, 3, భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ డివిజన్‌లకు చెందిన వెయ్యి మంది అధికారులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి సింగరేణి అధికారుల ర్యాలీ

గోదావరిఖని, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): సింగరేణి యాజమాన్యంపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం గోదావరిఖనిలో నిరసన ప్రదర్శనకు దిగారు. ర్యాలీలో రామగుండం-1, 2, 3, భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ డివిజన్‌లకు చెందిన వెయ్యి మంది అధికారులు పాల్గొన్నారు. స్థానిక ఆర్‌సీఓఏ క్లబ్‌ నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ ప్రధాన చౌరస్తా మీదుగా జీఎం ఆఫీస్‌ వరకు కొనసాగింది. కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఎంఓఏఐ) సింగరేణి శాఖ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో అధికారుల సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్‌, ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులు, ఉపాధ్యక్షుడు పొనగోటి శ్రీనివాస్‌ పాల్గొని అధికారులపై సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తున్న మొండివైఖరిని వివరించారు. అధికారుల వేతనంలో భాగమై పీఆర్‌పీని కోల్‌ ఇండియాలో చెల్లిస్తున్నప్పటికీ సింగరేణిలో రెండేళ్లుగా అమలు చేయడం లేదన్నారు. 2006 జనవరి నుంచి కోల్‌ ఇండియాలో పే అప్‌ గ్రేడేషన్‌ అమలులోకి వచ్చినప్పటికీ సింగరేణిలో అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌ ఇండియాలో అమలులో ఉన్న అనేక భత్యాలు సింగరేణి అధికారులకు అందడం లేదన్నారు. ఈ పరిస్థితి సంస్థ అభివృద్ధి, ఉత్పాదకత, కార్యనిర్వహణకు ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. సింగరేణిని తమ సొంత సంస్థగా భావిస్తూ విధులు నిర్వహించే అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని వారు హెచ్చరించారు.

Updated Date - Jun 17 , 2026 | 11:54 PM